రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దివ్వెల మాధురిని పరామర్శించేందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా స్పష్హత ఇచ్చారు. తనకు మాధురిని పరామర్శించి, ధైర్యం చెప్పి రావాలనే ఉందని కానీ, బయటకు వెళ్తే భార్యా పిల్లలు తన ఇంటిని కబ్జా చేస్తారని ఆసుపత్రికి వెళ్లడం లేదన్నారు.
మాధురి రోడ్డు ప్రమాద ఘటనపై స్పందిస్తూ..డిప్రెషన్ కారణంగానే కారు యాక్సిడెంట్ జరిగినట్లు మాధురి తనతో చెప్పిందన్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వాణి ఆరోపణలు చేయడంతో మాధురి తీవ్ర ఒత్తిడికి గురైందని వివరించారు. వాణి వలన మాధురి పుట్టింటికి, మెట్టినింటికి దూరమైందని చెప్పుకొచ్చారు.
అయితే, మాధురి గతంలోనూ ఓసారి ఆత్మహత్యయత్నం చేసిందన్న దువ్వాడ శ్రీనివాస్.. ఆ సమయంలోనే ఆమెను తనే కాపాడానని తెలిపారు. మాధురి కారు ప్రమాదం ఓ డ్రామా అంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామా చేసేందుకు ఎవరూ ప్రాణాల మీదకు తెచ్చుకోరు కదా అంటూ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో మాధురి తలకు తీవ్రమైన గాయం అయిందని..సంవత్సరంలోపు ఏమైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారన్నారు.
భార్యభర్తల మధ్య తలెత్తే గొడవల్లో సమాజం అంతా భర్తనే వేలెత్తి చూపిస్తుందన్నారు దువ్వాడ. తన జీవితంలో భార్యతో అనుక్షణం నరకం అనుభవించానని, పిల్లలకు సైతం విషం నూరిపోసి తనపైకి ఉసిగొల్పిందని ఆరోపించారు. వాణి మనస్తత్వం తెలిసే రెండేళ్ళ కిందటే విడాకుల నోటీసు ఇచ్చానని స్పష్టం చేశారు.