విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తోన్న బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లా వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చి చివర్లో వెనుదిరగడం చర్చనీయాంశం అవుతోంది.
వైవీ సుబ్బారెడ్డి ఆఖర్లో ఎందుకు వెనుదిరిగారు..? బొత్స పోటీపై వైవీ అసంతృప్తిగా ఉన్నారా..? లేదంటే వైవీ సుబ్బారెడ్డిని బొత్స ఖాతరు చేయకపోవడమే ఇందుకు కారణమా? అనే చర్చ జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డితో సన్నిహితంగా మెదిలే నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఈ సందేహాలను రెట్టింపు చేస్తోంది.
Also Read : బీజేపీకి మిథున్ రెడ్డి పరోక్ష సంకేతాలు పంపుతున్నారా?
మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోపాటు సీనియర్ నేతలు పలువురు ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. కేవలం బొత్స సతీమణి బొత్స ఝాన్సీ, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, అరకు ఎంపీ తనుజా రాణి మరో ఇద్దరు నేతలు హాజరయ్యారు. దీంతో కీలక నేతలు ఎందుకు డుమ్మా కొట్టారు.. ఆఖర్లో వైవీ ఎందుకు జారుకున్నారు..? అనేది వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది.