రీ రిలీజ్ సంప్రదాయాన్ని ‘మురారి’ కొనసాగించింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కెలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లే అందుకొంది. సినిమా థియేటర్లో ప్రేమ జంట పెళ్లి చేసుకోవడం లాంటి విచిత్రమైన సంఘటనలకు ఈ సినిమా వేదికై, మరింత ప్రాచుర్యం తెచ్చుకొంది.
అయితే ఇప్పుడు ‘మురారి’ సీక్వెల్ ఆలోచనలు టాలీవుడ్ చుట్టూ తిరుగుతున్నాయి. మహేష్ వారసుడు గౌతమ్ ఘట్టమనేనితో ‘మురారి’ సీక్వెల్ చేయొచ్చు కదా, అని ఓ నెటిజన్ కృష్ణవంశీని సోషల్ మీడియా ద్వారా కోరాడు. ‘అది మన చేతుల్లో లేదు, మహేష్, నమ్రతలే ఆ నిర్ణయం తీసుకోవాలి’ అంటూ కృష్ణవంశీ సమాధానం చెప్పారు. మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేని చిత్రం ‘మురారి’. నటుడిగా మహేష్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన సినిమా అది. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. కృష్ణవంశీ టేకింగ్, మణిశర్మ సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం… ఇవన్నీ కలిపి, ఈ సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మహేష్ తనయుడిగా గౌతమ్ ఈ సినిమా చేస్తే బాగానే ఉంటుంది. మంచి ఆలోచన కూడా. కానీ.. అది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం అయితే కాదు. గౌతమ్ ఇప్పుడు చదువుకొంటున్నాడు. తనకు సినిమాలపై ధ్యాస ఉందో, లేదో తెలీదు. మహేష్ లా కొన్ని సినిమాలు చేసి, అనుభవం సంపాదించిన తరవాతే ‘మురారి’ లాంటి క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలడు. అప్పటికి కృష్ణవంశీ ఫామ్ లో ఉంటాడా అనేది పెద్ద ప్రశ్న. అంటే దాదాపుగా ఈ సీక్వెల్ కు ఛాన్స్ లేనట్టే.
Also Read : ‘మురారి’ చూశాక కూడా ‘మూడ్’ లేదంటారా..?!
కృష్ణవంశీకి కూడా ‘మురారి’ సీక్వెల్ పై ఎలాంటి ఆశలూ, అంచనాలూ లేవు. వీలైతే మహేష్ తో మరో సినిమా చేస్తే బాగుంటుందన్నది ఆయన ఆలోచన. ‘మురారి’ తరవాత కృష్ణవంశీ – మహేష్ కలిసి సినిమా చేయనే లేదు. మహేష్ ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణవంశీకి అవకాశం ఇవ్వాలంటే అద్భుతమే జరగాలి. ఎప్పుడూ రియాలిటీకి దగ్గరగా ఉండే కృష్ణవంశీకీ ఈ విషయం తెలుసు. తన చేతిలో రెండు మూడు పెద్ద హిట్స్ ఉంటే తప్ప, పెద్ద హీరోల దృష్టి తనపై పడదు. కృష్ణవంశీ కూడా ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ‘రంగమార్తాండ’ తరవాత ఆయన ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఇదో ప్రేమకథ. ‘చందమామ’లా రెండు మూడు జంటల కథని ఒకే సినిమాలో చూపించాలనుకొంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.