ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలియాలి అనేది సినిమా డైలాగే అయినా, రాజకీయాల్లోనూ సరిగ్గా సరిపోతుంది. అధికారం ఉంది కదా, ఏదైనా చేయవచ్చు అని అనుకోకుండా…. చివరి వరకు ప్రత్యర్థులను టెన్షన్ పెట్టి, తమకు తామే వెనక్కి తగ్గారు టీడీపీ అధినేత చంద్రబాబు.
విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీకి క్లియర్ బలం ఉంది. కానీ అందులో నుండి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చాలా మంది ఇప్పటికే కూటమి సర్కార్ కు జైకొట్టారు. దీంతో ఉప ఎన్నికల్లో వైసీపీపై కూటమి తరఫున టీడీపీ పోటీలో ఉంటుందని అంతా భావించారు. ఆ భయంతోనే జగన్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతోనూ మీటింగ్ పెట్టారు. సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వలేదు… ఇప్పుడు మాత్రం మా అవసరం ఉండటంతో పిలిచి మరీ ఫోటోలు దిగుతున్నారంటూ వారంతా కామెంట్ కూడా చేశారు.
అయితే, ఫెయిర్ పాలిటిక్స్ ఉంటాయని చంద్రబాబు చెప్పినట్లే… వైసీపీకి అధికారికంగా బలం ఉన్న చోట పోటీ ఎందుకు అంటూ వెనక్కి తగ్గారు. ఒక్క సీటుతో పోయేదేమీ లేదు, కూటమి గెలిచినా అధికారం అడ్డంపెట్టుకొని గెలిచారన్న అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ చెడ్డ పేరు మనకెందుకు అన్నట్లుగా వెనక్కి తగ్గినట్లు స్పష్టంగా కనపడుతోంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ పై పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలపై ఎక్కడా వ్యతిరేకత లేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు వెనక్కి తగ్గి సరైన నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం కూటమి పార్టీల్లో వ్యక్తం అవుతోంది.