వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో కొనసాగుతోన్న వివాదంపై వైసీపీ నేతలు ఎవరూ చడీ చప్పుడు చేయడం లేదు. గతంలో వాణి – దువ్వాడ శ్రీనివాస్ మధ్య తలెత్తిన వివాదానికి సర్ది చెప్పి బుజ్జగించిన నేతలు ఇప్పుడు పంచాయితి తారాస్థాయికి చేరినా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించడం లేదు.
గతంలో ఎలాగైతే దువ్వాడ ఫ్యామిలీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారో ఇప్పుడూ వైసీపీ పెద్దలు అదే చొరవ చూపించవచ్చు కదా అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే , ఇది దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారమని, అందులో తాము తలదూర్చబోమని తాజాగా స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీని తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.
ఇది దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారం అయినప్పుడు, పవన్ కళ్యాణ్ ది కూడా వ్యక్తిగత జీవితమే కదా.. మరి గతంలో పవన్ పర్సనల్ లైఫ్ ను ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి జగన్ వరకు జనసేనాని పర్సనల్ లైఫ్ పై ఎటాక్ చేశారు.
తన వ్యక్తిగత జీవితంపై రాజకీయ విమర్శలు సరికాదని పవన్ సూచించినా , తగ్గేదేలే అంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పర్సనల్ లైఫ్ ఏంటి.. అంటూ ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు దువ్వాడపై చర్యలు చేపట్టాలని డిమాండ్ లు వస్తోన్న నేపథ్యంలో వైసీపీ కొత్త వాదనను వినిపిస్తోంది.
ఇది రాజకీయపరమైన విషయం కాదని, ఆయన వ్యక్తిగత వ్యవహారమని అందుకే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తమకు సెట్ కానీ డైలాగ్ లను పేల్చింది వైసీపీ. దీంతో అధికారం కోల్పోయాక వైసీపీ నేతలకు పద్దతులు కూడా గుర్తుకొస్తున్నాయని సెటైర్లు పేలుతున్నాయి.