అధికారులు వస్తుంటారు… పోతుంటారు… నేను లోకల్ అంటూ సినిమా డైలాగ్ తో తనపై నమోదైన కేసు గురించి స్పందించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది… అందుకే నాపై కేసు పెట్టారు అంటూ హైడ్రా చీఫ్ ఐపీఎస్ రంగనాథ్ పై దానం గరంగరం అయ్యారు.
హైడ్రా చీఫ్ పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానంటూ ఎమ్మెల్యే దానం ప్రకటించారు. హైదరాబాద్లోని నందగిరిహిల్స్ లోని ప్రభుత్వ స్థలం కాంపౌండ్ ను కూల్చివేసిన ఘటనపై అందిన ఫిర్యాదుతో దానంపై హైడ్రా కేసు నమోదు చేసింది.
అయితే, ఈ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్… ప్రజాప్రతినిధిగానే అక్కడికి వెళ్లా. ఆ హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదు. నందగిరి హిల్స్ హుడా లేఔట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందునే అక్కడికి వెళ్లా. ప్రజా సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నాపై కేసు నమోదు విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లా. కేసులు నాకు కొత్తేమి కాదు. గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారు. నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటిసులు పంపిస్తా. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ దానం ఫైర్ అయ్యారు.
కొన్ని రోజులుగా ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఎవ్వరి ప్రమోయం ఉన్నా ఉపేక్షించకుండా… కూల్చివేతలు చేపట్టింది.