హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. కానీ ఈ నగరానికి ఉన్న అతి పెద్ద సమస్య చెరువులు, రోడ్లు , పార్కులు, నాలాలు ఇలా దేన్నీ వదలకుండా ఆక్రమించుకోవడం. చెరువుల నగరంగా పేరున్న హైదరాబాద్‌లో ఇప్పుడు చెరువులన్నీ మాయమవుతున్నాయి. వాటికి రికార్డులు ఎవరు.. ఎలా పుట్టిస్తున్నారో కానీ అందులో భవనాలు వెలిసిపోతున్నాయి. పెద్ద పెద్ద చెరువులు సైతం చిన్న చిన్న కుంటల్లా మారిపోతున్నాయి. ఫలితంగా వానలొస్తే మునకలు సహజంగా మారాయి.
ఒక్క చెరువులే కాదు.. నాలాలు దగ్గర నుంచి అక్రమ కట్టడాల వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి ఇది చెరువు భూమో.. చెరువు శిఖం భూమో లేకపోతే మరో కబ్జా చేసిన స్థలమో అన్న భయం గట్టిగా వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్ని చెక్ పెట్టడానికి హైడ్రా అనే వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనే చట్టం చేశారు.
Also Read : హైడ్రా దూకుడు… అక్రమ నిర్మాణాలకు బ్రేక్ పడుతుందా?
హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు హైడ్రా పరిధి ఉంది. హైడ్రా కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను నియమించారు. ఆయన ఇటీవలి కాలంలో ఆక్రమణలపై విరుచుకుపడుతున్నారు. రాజేంద్రనగర్‌లో మజ్లిస్ ఎమ్మెల్యే ఇంటిని సైతం కూల్చివేశారు.
హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రే ఉంటారు. ఆయన హైదరాబాద్‌కు ఓ క్లాస్ లుక్ తీసుకు వచ్చేందుకు పట్టుదలగా ఉన్నారు. అందుకే ఆక్రమణలు.. అక్రమ కట్టడాలను సహించే అవకాశం లేదు. చట్టాలను పర్ ఫెక్ట్ గా అమలు చేస్తే.. రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్ణయుగమే అనుకోవచ్చు. ప్రజలకు భరోసా ఉంటుంది. బిల్డర్లకు నిశ్చింత ఉంటుంది.