తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని చెప్తూ, నాలుగు వారాల పాటు కేసును వాయిదా వేసింది.
తమ నియామకాన్ని పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన సిఫారసుల ఆధారంగా గవర్నర్ కొత్త వారిని ఎంపిక చేయటాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొత్త ఎమ్మెల్సీల నియామకంపై స్టే విధించాలని పిటిషనర్లు కోరగా… కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులను హరించినట్లు అవుతుందని కామెంట్ చేసింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేయటం ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. దీనిపై గవర్నర్, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఎన్నికలకు ముందు కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలు నామినేట్ చేయాలని గవర్నర్ కు సిఫారసు చేయగా… గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది. వారిద్దరికీ రాజకీయ పార్టీలతో సంబంధాలున్నాయని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోపు కొత్త ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పేర్లను సిఫారసు చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ లను నామినేట్ చేయాలని గవర్నర్ నామినేట్ చేశారు. దీనిపై దాసోజు, కుర్ర సత్యనారాయణలు కోర్టును ఆశ్రయించగా, వారి నియామకం ఆగిపోయింది.