మరికొద్ది రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడి నియామకంతోపాటు మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి..ఈ నెల 17న లేదా 18న ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో ఈ విషయంపై చర్చించనుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌తోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే ఆరు మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉన్నా, ప్రస్తుతం నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన హోం మంత్రిత్వ శాఖతోపాటు మరో శాఖను రేవంత్ తన వద్దే ఉంచుకుంటారని అంటున్నారు.
మరోవైపు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, బలరాంనాయక్, సంపత్‌కుమార్ ల మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే, మిగిలిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ చామల కిరణ్ కుమార్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.