తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చేశారు. పెట్టుబడుల కోసం సాగిన ఆయన అధికారిక టూర్ ముగియగా… ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించిన పీసీసీ చీఫ్ ల సమావేశానికి రేవంత్ రెడ్డి హజరుకాలేకపోయారు. దీంతో రెండు మూడు రోజుల్లో సీఎం ఒక రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే, తెలంగాణలో కే.కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చేసింది. ఈ నెల 21 నుండి నామినేషన్లు మొదలవుతుండగా, 27వ తేదీన అభ్యర్థుల ఫైనల్ జాబితా రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 3న ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఉప ఎన్నిక కావటం, ఇప్పటికే సగం పదవీకాలం కూడా పూర్తైన నేపథ్యంలో… ఎవరికి అవకాశం ఇస్తారన్నది కీలకంగా మారింది. తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత వీహెచ్ ఇప్పటికే కోరుతుండగా, అద్దంకి దయాకర్ పేరు కూడా వినిపిస్తోంది.
కానీ, జాతీయ పార్టీ అవసరాల దృష్ట్యా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేరును ఏఐసీసీ ప్రతిపాదించే అవకాశం ఉందని వార్తలొస్తున్నప్పటికీ… రాష్ట్ర నాయకత్వం ఒప్పుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉండటంతో… అక్కడే ఎంపీ అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.