వైసీపీలో అడ్డగోలుగా దోచుకున్న ప్రతి ఒక్కరి గుట్టు బయటపడుతోంది. తాజాగా ఇళ్ల నిర్మాణం పేరుతో అడ్డగోలు స్కాములు చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇరుక్కుపోతున్నారు. రాప్తాడు నుంచి వరుసగగా పోటీ చేస్తూ ఓడిపోతూ ఆస్తులన్నీ పోయాయని కన్నీరు పెట్టుకుని ఇంటింటికి పోయిన బతిమాలుకుని సెంటిమెంట్‌తో 2019లో గెలిచిన తోపుదుర్తి ఐదేళ్లలో ఎమ్మెల్యేగానే వందల కోట్ల ఆస్తి పరుడయ్యారు. ఆయన సంపాదించిన దాంట్లో కమిషన్లు… దందాతో కాకుండా.. రాక్రీట్ అనే కంపెనీ ద్వారానే ఎక్కువ సంపాదించారు.
రాక్రీట్ అనే కంపెనీని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెట్టారు. ఈ కంపెనీ సెంట్ స్థలాల్లో ఇళ్లు కట్టిస్తామని చెప్పి అడ్వాన్సులు తీసుకుని పత్తా లేకుండా పోయింది. ఇలా కడతామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్న వాటిలో పులివెందుల ఇళ్లు కూడా ఉన్నాయి. రాక్రీట్ సంస్థ ఒక్క పులివెందులోనే కాదు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇలాంటి కాంట్రాక్టులు తీసుకుని ఇళ్లు కట్టకుండా బిల్లులు పిండుకుంది. కానీ అసలు ఇళ్లే పూర్తి చేయలేదు. కొన్ని ఇళ్లు గోడల వరకు.. అత్యధికం పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. ఒక్క ఇంటిని సైతం పూర్తి చేయలేదు కానీ బిల్లులు మాత్రం వందల కోట్లలో వసూలు చేసుకుంది.
కొసమెరుపేమిటంటే టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు చేశారు. రాక్రీట్ ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు వస్తే.. వందల కోట్ల ప్రజాధనం ఎంత సింపుల్ గా దోచేశారో స్పష్టమవుతుంది. ఇప్పుడు విజిలెన్స్ ఇవన్నీ బయటకు తీస్తుంది.