ఆంధ్రప్రదేశ్లో దేశంలో తొలి సారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. దేశంలోనే ప్రైవేటు యూనివర్శిటీల్లో నెంబర్ వన్ గా ఉన్న ఎస్ఆర్ఎంతో కలిసి రిలయన్స్ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. లాంఛనాలు అన్నీ పూర్తి చేసిన తర్వాత యూనివర్శిటీ ప్రకటన ఉండే అవకాశం ఉంది.
ఎస్ఆర్ఎం ఇప్పటికే అమరావతిలో అతి పెద్ద క్యాంపస్ నిర్వహిస్తోంది. గత ఐదేళ్లలో విస్తరణ ప్రణాళికలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రభుత్వం మారడంతో పూర్తి స్థాయిలో ఊపందుకోనున్నాయి. ఇటీవల ఎస్ఆర్ఎం చైర్మన్ తో పాటు ఆ యూనివర్శిటీ బృందం చంద్రబాబుతో సమావేశం అయింది. ఈ సందర్భంగా ఏఐ యూనివర్శిటీ ప్రస్తావన వచ్చింది. ఇలాంటి యూనివర్శిటీని నిర్వహణకు.. ఓ కార్పొరేట్ కంపెనీ అండ ఉంటే… మంచిదన్న అభిప్రాయానికి రావడంతో.. రిలయన్స్ తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
భవిష్యత్ లో ఏఐదే ప్రముఖ పాత్ర. మానవ వనరులను తర్వాతి తరం అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడంలో ఏఐ విజ్ఞానానిది కీలక పాత్ర. వచ్చే ఇన్నో వేషన్లన్నీ ఏఐ కేంద్రంగానే ఉంటాయి. అందుకే ఈ యూనివర్శిటీ గేమ్ ఛేంజర్ గా మారుతుదన్న అంచనాలు ఉన్నాయి.