జాతీయ అవార్డుల్ని ప్రకటించారు. అందులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ప్రతీసారీ ఏదో ఓ తెలుగు చిత్రానికి ఈ విభాగంలో అవార్డు దక్కుతుంది. కాబట్టి.. ఆ కోటాని ‘కార్తికేయ 2’ పూర్తి చేసుకొందనుకోవాలి. అది మినహాయిస్తే తెలుగు సినిమా మెరుపుల్లేవు. 2022కి సంబంధించిన అవార్డులు ఇవి. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా ఇదే యేడాది విడుదలైంది. కానీ 2021లో సెన్సార్ చేసుకొంది. నిబంధనల ప్రకారం 2021 అవార్డులకు ‘ఆర్.ఆర్.ఆర్’ అర్హత సాధించింది. అలా.. 2021 కోటాలో ‘ఆర్.ఆర్.ఆర్’ కొన్ని అవార్డుల్ని కొలగొట్టింది.
2022లో తెలుగు నుంచి మంచి సినిమాలేం రాలేదా..? అంటే ‘సీతారామం’ సమాధానంగా కనిపిస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. వైజయంతీ మూవీస్ నిర్మించింది. నిజానికి 2022లో వచ్చిన మంచి సినిమాల్లో అదొకటి. కథాపరంగా, టెక్నికల్ గా, నటీనటుల పరంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. అయినా సరే, ప్రాంతీయ చిత్రం అవార్డు సంపాదించలేకపోయింది. ‘కార్తికేయ 2’కి హిందుత్వం టచ్ ఉంది. అందుకే ఆ సినిమాకు అవార్డు కట్టబెట్టారేమో..?
దుల్కర్ సల్మాన్ నటన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వ ప్రతిభ, మృణాళ్ అభినయం, చక్కటి సంగీతం ఇవేం జాతీయ అవార్డు కమిటీని కదిలించలేకపోవడం బాధాకరం. నిజానికి 2022 అవార్డుల్లో మిగిలిన సినిమాలకు ‘సీతారామం’ గట్టి పోటీ ఇస్తుందనుకొన్నారు. కానీ.. ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. జాతీయ అవార్డుల విషయంలో లాబీయింగ్ లు గట్టిగా జరుగుతాయన్న విమర్శ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ‘సీతారామం’ నుంచి అలాంటివేం జరగలేదేమో అనుకోవాలి.