తెలంగాణలో బలహీనపడుతోన్న బీఆర్ఎస్ ను పటిష్టం చేయడంపై గులాబీదళం దృష్టిసారించింది. ఈమేరకు దేశంలోని ప్రాంతీయ పార్టీల ఎదుగుదలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. సంక్షోభాలు ఎదురైనప్పుడు ఆ పార్టీలు ఎలా ఎదుర్కొన్నాయి..వాటిని చేధించి ఎలా దృఢంగా నిలబడ్డాయో తెలుసుకొని బీఆర్ఎస్ ను మళ్లీ తిరుగులేని శక్తిగా మార్చాలని నిర్ణయించింది.
ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి పుష్కరకాలం తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ..అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ ఉనికిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా జీరో నెంబర్ కు పడిపోయింది. దీంతో బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్ళడం కత్తి మీద సాములా మారింది.
దీంతో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీల ఎదుగుదలపై అధ్యయనం కోసం వచ్చే నెలలో ఓ బృందం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ బయల్దేరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. డీఎంకే, టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీల ప్రస్థానం, సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేసేందుకు వెళ్తామన్నారు. ఈ పర్యటన ముగిశాక తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుగుదల కోసం ఆ పార్టీ నేతలు చర్యలు చేపట్టనున్నారు.