తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సపోర్టుగా నిలిచారు. హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆక్రమణలు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్ తీరును అభినందించాల్సిందేనని ఆయన ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాలని.. తప్పు చేస్తే పోరాడాల్సిందేనన్నారు. బీజేపీని ఎంపీని అయిన తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించడం మంచి సంప్రదాయమన్నారు. అదే సమయంలో తప్పు చేస్తే వదిలేది లేదని కూడా అన్నారు. ఈ ప్రక్రియను కొనసాగుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి .. మొదట బీఆర్ఎస్ నుంచి రాజకీయం ప్రారంభించారు.తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ తరపున 2019లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. కానీ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని బీజేపీలో చేరిపోయారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి వచ్చింది. అయితే పదే పదే పార్టీ మారడం ఇష్టం లేని కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోనే ఉండిపోయారు.
కేటీఆర్ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉండే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంకా తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు ప్రారంభించలేదు.మొదటగానే ఆయన గుడ్ ఒపీనియన్ వెల్లడించడం బీజేపీకి కాస్త షాక్ లాంటిదే.హైడ్రా విషయంలో చాలా మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే అసంతృప్తితో ఉన్నారు. కానీ బీజేపీ ఎంపీ నుంచి సపోర్ట్ రావడం .. రేవంత్‌కు నైతిక బలం ఇచ్చేదే అనుకోవచ్చు.