ఈ పంద్రాగస్టుకు గురు శిష్యులు పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ల సినిమాలు రెండూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పూరి డబుల్ ఇస్మార్ట్ తీస్తే, హరీష్ మిస్టర్ బచ్చన్ ని చూపించాడు. రెండూ ఫ్లాపులే. రెండింటికీ నెగిటీవ్ రివ్యూలే వచ్చాయి. ఇవేం సినిమాల్రా బాబూ.. అంటూ ప్రేక్షకులు తలలు పట్టుకొని థియేటర్ల నుంచి బయటపడుతున్నారు. అయితే మిస్టర్ బచ్చన్‌కి జరిగినంత డ్యామేజీ… ఇస్మార్ట్ శంకర్‌కు జరగలేదు. మిస్టర్ బచ్చన్‌ని ట్రోల్ చేసినంతగా ఇస్మార్ట్ శంకర్‌ని ట్రోల్ చేయలేదు. దానికి కారణం.. అక్కడున్నది పూరి, ఇక్కడున్నది హరీష్ శంకర్.
పూరిపై ప్రేక్షకులకు ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. సినిమాపై సంపాదించింది, మళ్లీ సినిమాలపైనే పెడతాడు. సినిమా తన ఫ్యాషన్. ఎప్పుడూ ఎక్కడా బడాయిలకు పోడు. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, తన జీవితం… ఇంతే పూరి. హరీష్ అలా కాదు. చాలా ఎగ్రసీవ్. ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో చాలా దూకుడుగా మాట్లాడతాడు. అలా మాట్లాడడం తప్పు కాదు. తన ఆవేశాన్ని అర్థం చేసుకోవొచ్చు. కానీ ఏదో ఒకరోజు, ఇలా ఫ్లాపులిచ్చినప్పుడు దొరికిపోతాడు. మామూలుగా ట్రోల్ చేయాల్సిన దానికంటే డబుల్ ఎఫెక్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ విషయంలో జరుగుతోంది అదే. సోషల్ మీడియా తెరిస్తే… ‘మిస్టర్ బచ్చన్’పై నెగిటీవ్ కామెంట్లే కనిపిస్తాయి. ఇంత రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలో నటించిన రవితేజని ఎవరూ అనడం లేదు. ఈ కథపై ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల్ని ట్రోల్ చేయడం లేదు. కేవలం హరీష్ మాత్రమే దొరికిపోయాడు. నిజానికి డబుల్ ఇస్మార్ట్ కంటే… మిస్టర్ బచ్చన్ ఎంతో కొంత బెటర్ సినిమానే. కానీ… సోషల్ మీడియాలో హరీష్ చూపించే అనవసరమైన దూకుడు వల్ల ఇప్పుడు బలి అయిపోవాల్సివచ్చింది. అందుకే కంట్రోల్ చాలా అవసరం అని చెబుతుంటారు పెద్దోళ్లు. హిట్ వచ్చినప్పుడు కాస్త వినమ్రంగా ఉంటే, ఫ్లాప్ అయినప్పుడు పెద్దగా రాళ్లు పడవు. ఈ విషయం హరీష్ మాత్రమే కాదు. అందరూ గుర్తు పెట్టుకోవాలి.