ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేస్తాననే సీఎం చంద్రబాబు ప్రకటనకు అనుగుణంగా ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండగా.. పలు ప్రఖ్యాత విద్యా సంస్థలు కూడా విద్యాసంస్థలను నెలకొల్పేందుకు సిద్దపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అమరావతిలో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు బీసీఐ ( బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైకోర్టుకు సమీపంలో ఈ వర్సిటీ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరినట్లుగా సమాచారం. బీసీఐకి చెందిన బీసీఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్ తో ఈ వర్సిటీ ఏర్పాటు కానుంది.
బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశంలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనతికాలంలో ప్రతిష్టాత్మక సంస్థలుగా వెలుగొందాయి. 1986లో బెంగళూరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ , 2022లో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు అయ్యాయి.
ఈ రెండు సంస్థలు దేశంలో న్యాయ విద్యను అభ్యసించాలని భావించే విద్యార్థులను బాగా ఆకర్షించాయి. దేశవ్యాప్తంగా న్యాయ విశ్వవిద్యాలయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంగా పేరొందిన ఈ సంస్థ ఇప్పుడు అమరావతిలో వర్సిటీని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.
దేశంలో న్యాయవిద్యను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే దిశగా ముందడుగు పడింది..అమరావతిలో బీసీఐ నెలకొల్పే యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాలకు , నైపుణ్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని ఎక్స్ లో పేర్కొన్నారు చంద్రబాబు.