కాంగ్రెస్ , బీజేపీ రాజకీయాలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విలీనం రాజకీయంలో బీఆర్ఎస్ రోజురోజుకు డిఫెన్స్ లో పడుతోంది. కేటీఆర్ ఈ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నా ఆయన బలం ఏమాత్రం సరిపోవడం లేదు కదా.. సరికొత్త అనుమానాలకు దారితీసేలా ఉంటున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఏదో ఓ జాతీయ పార్టీలో విలీనం కాక తప్పదా అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ చర్చ ఎక్కువగా ఉంటున్నా.. అసలు పోటీ మాత్రం కాంగ్రెస్ – బీజేపీల మధ్య ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య విమర్శలకు స్టఫ్ గా మారిపోయింది బీఆర్ఎస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. వీటిని ఎలా తిప్పికొట్టాలో తెలియక బీఆర్ఎస్ నేతలు తెగ గింజుకుంటున్నారు.
విలీనం వార్తలను కేటీఆర్ ఖండిస్తున్నా.. హరీష్ రావు పెద్దగా ఖండించడం లేదు. ఇక కేసీఆర్ మాత్రం మీడియా ముందుకే రావడం లేదు. దీంతో విలీనం విషయంలో పార్టీ కేడర్ అనుమానాలను పటాపంచలు చేయాలంటే కేసీఆర్ స్పందించాలని డిమాండ్ లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ ప్రచారం జరుగుతోన్నా కేసీఆర్ స్పందించకపోవడం విలీనం ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుందని బీఆర్ఎస్ శ్రేణులే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నాయి.
ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని లేదంటే ఇదే నిజం అనుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి కేసీఆర్ ఈ విలీనం వార్తలపై ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.