భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బయటకు రాలేని చక్ర వ్యూహంలో ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీనే కాదు తమ పార్టీ నేతల రాజకీయ జీవితాల్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి కల్పించేలా రాజకీయాలు మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆ పార్టీ తరపున ఎవరికీ రాజకీయ భవిష్యత్ లేకుండా చేసి.. చివరికి ఆ పార్టీని విలీనం చేయాలనుకునే ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగానే జరుగుతున్న ప్రతి విషయంపై లీకుల్ని ఇస్తోంది. కానీ దాన్ని ఖండించే పరిస్థితి బీఆర్ఎస్కు లేకుండా పోతోంది.
ఖండించలేని దుర్భరమైన స్థితిలో బీఆర్ఎస్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పై రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చర్చల ప్రతిపాదనల్లో ఉన్న అంశాలను బయట పెట్టారు. ఇవి ఊహాగానాలు కాదని మీడియా ప్రతినిధులందరికీ తెలుసు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ సుదీర్ఘ చర్చలు జరిగాయి. అందులో ఓ ఫార్ములా కూడా రెడీ అయింది. దాన్నే రేవంత్ బయట పెట్టారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత .. రేవంత్ అలా మాట్లాడారని మీడియా రిపోర్టు చేశాక కేటీఆర్ అత్యంత బలహీనమైన స్పందన వ్యక్తం చేశారు. రేవంత అమెరికా అధ్యక్షుడు అవుతాడని అంటే నమ్మేస్తారా అని పేలవరమైన సెటైర్ వేశారు. అక్కడే ఆయన ఎంత బలహీన స్థితిలో ఉన్నారో క్లారిటీ వస్తుంది.
విలీనమైనా అంత ప్రాధాన్యముండదని బండి సంజయ్ సంకేతాలు
అయితే బీఆర్ఎస్ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేరున్న బండి సంజయ్ మాత్రం ఘాటుగా స్పందించారు. ఆయన పైకి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ ను విమర్శించినట్లుగా ఉన్నా… బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదని చెప్పేలా కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే అంత ప్రాధాన్యం ఇస్తారా అన్నట్లుగా కౌంటర్ విమర్శలు చేశారు. బీఆర్ఎస్కు అంత సీన్ లేదని.. ఆయన ఉద్దేశం. తననే టీ బీజేపీ చీఫ్ గా కొనసాగించి ఉంటే.. ఇప్పుడు సీఎంగా కూడా తానే ఉండేవాడినని బండి సంజయ్ గట్టి నమ్మకం. ఒక వేళ బీఆర్ఎస్ విలీనమైతే.. పదవుల్లో ఆ పార్టీ నేతలు వాటాకొస్తారు.
ఏ ప్రాధాన్యం లేకపోయినా విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారా ?
కేటీఆర్ గట్టిగా ఖండించలేకపోవడం.. బీజేపీతో సంబంధాలు పెట్టుకునేది లేదని చెప్పకపోతూడంటంతో అందరిలోనూ ఓ క్లారిటీ వచ్చింది. కానీ బీజేపీలోనే గట్టి వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ విలీన వ్యూహంతో… పూర్తి స్థాయిలో ముందుగానే బీఆర్ఎస్ ను బలహీనం చేసేందుకు ఓ పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఎక్కువగా సమాచారం కాంగ్రెస్కు లీకవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . చివరికి కేసీఆర్, కేటీఆర్ లకు సైతం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోయినా విలీనం చేయకతప్పని పరిస్థితిని వ్యూహాత్మకంగా కల్పిస్తున్నరన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి రావడం .. పూర్తిగా ఆ పార్టీ అగ్రనేతల స్వయంకృతమే.