సిద్ధిపేటలో ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. హరీష్ రావు ఇలాకాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీతో రైతు రుణమాఫీ అంశంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ గతంలో చేసుకున్న సవాళ్లు ఇప్పుడు పార్టీ శ్రేణుల మధ్య దూకుడుకు కారణం అయ్యింది.
రుణమాఫీ పూర్తైంది రాజీనామా ఎప్పుడు అంటూ హరీష్ రావుపై హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. మైనంపల్లి అభిమానుల పేరుతో ఈ ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపాయి. ఆ తర్వాత సిద్ధిపేటలోనూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో ఆ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు తొలగించే ప్రయత్నం చేయటంతో… కాంగ్రెస్ శ్రేణులు హరీష్ రావు ప్లెక్సీలను, క్యాంప్ ఆఫీసును టార్గెట్ చేశాయి. రాత్రికి రాత్రి ఫ్లెక్సీలను తొలగించటంతో కొట్లాట రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
దీంతో పోలీసులు ఉదయం నుండి పికెటింగ్ పెట్టారు. సిద్దిపేట హరీష్ రావు క్యాంప్ ఆఫీసుపై దాడి జరిగిందన్న ప్రచారంతో సిద్దిపేట నియోజకవర్గం నుండి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన క్యాడర్ ను కూడా రప్పిస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.