పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే విషయంలో చట్ట పరిధిలోనే వ్యవహరిస్తానని శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవన్నారు.
జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే సమస్యలపై మాట్లాడేందుకు తప్పకుండా అవకాశం ఇస్తామని తెలిపారు. అదే సమయంలో అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు అయ్యన్నపాత్రుడు.
మరోవైపు ఏపీ అసెంబ్లీకి కొత్తగా 80 మంది ఎన్నికయ్యారు అని , వారందరికీ త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలు – చట్ట సభల్లో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు.
ఇక, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పిటిషన్ మరోసారి విచారణకు రానుంది.