ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరు పరిశీలనలో ఉంది. దాన్నే ఫైనల్ చేయబోతున్నారు కూడా. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మైత్రీ ఆఫీసులో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే కథానాయిక ఎవరన్న విషయం మాత్రం తెలీలేదు. ప్రస్తుతానికి అందుతున్న వార్తలైతే ఈ సినిమా కోసం ఇమాన్ ఇస్మైల్ అనే కొత్త కథానాయిని పరిచయం చేస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన ఈ అమ్మాయి మంచి డాన్సర్. సోషల్ మీడియాలో సెలబ్రెటీ. ట్విట్టర్, ఇన్స్టాలలో తన ఫాలోయింగ్ కి తిరుగులేదు. ఎంబీఏ చదివిన ఈ అమ్మాయి… ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. ఈ సినిమా కోసం ఇండియా వచ్చిందని టాక్. ఈ సినిమా కోసం అయితే స్టార్ హీరోయిన్ ని, లేదా కొత్త అమ్మాయిని ఎంచుకోవాలని హను భావించాడు. చివరికి కొత్త అమ్మాయి వైపే మొగ్గు చూపించారు. ఈరోజు ఆమె పూజా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకొంది. నిజానికి రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాల్సివుంది. కానీ వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లోనే రాజాసాబ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ పాలు పంచుకొంటున్నాడు. ఈ నెలాఖరు వరకూ ప్రభాస్ `రాజాసాబ్`కే డేట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ తరవాత హను సినిమా పై ఫోకస్ చేస్తాడు.