బాపు – రమణ.. స్నేహానికి నిలువెత్తు చిరునామా. వాళ్లకూ బోలెడుమంది దోస్తులు. అందులో రావి కొండలరావు ఒకరు. ఈ ముగ్గురి ప్రయాణం ఇంచుమించుగా ఒకేసారి ప్రారంభమైంది. బాపు,రమణలు పనిచేసిన కొన్ని సినిమాల్లో నటుడిగా మెరిశారు కొండలరావు. ఆయన నటుడే కాదు, కథా రచయిత కూడా. కొండలరావు కథలు కొన్ని, బాపు దర్శకత్వంలో తెరకెక్కాయి. రావి కొండల రావు పెళ్లికి కూడా బాపు, రమణలే కారణం. బాపు, రమణలు కలిసి రాసిన దొంగ ఉత్తరం వల్ల రావి కొండలరావు పెళ్లయిపోయింది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే…
బాపు,రమణ సినిమాలపై దండయాత్ర చేస్తున్న రోజులు అవి. రావి కొండలరావు కూడా నటుడిగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అప్పట్లో.. రాధా కుమారిని ఆయన ఇష్టపడ్డారు. ఆమె కూడా నటే. ఇద్దరూ కలిసి నాటకాలు వేసేవారు. కలిసే ఉండేవారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. దానికి రకరకాల కారణాలు. లోకులు కాకులు కదా, సూటి పోటి మాటలు మాట్లాడేవారు. అవి బాపు, రమణల చెవిన పడేవి. స్నేహితుడ్ని అంతలేసి మాటలు అంటుంటే, వాళ్లకు మనస్సు చివుక్కుమనేది. కానీ ఏం చేస్తారు..? ‘పెళ్లి చేసుకోరాదూ..’ అని ఎన్నిసార్లు చెప్పినా, ‘ఆ.. చూద్దాంలే’ అని రావి కొండల రావు తప్పించుకొనేవారు. ఇక లాభం లేదని ఓ అల్లరి పని చేశారు బాపు, రమణ.
ఓసారి బాపు, రమణ ఏదో పనిమీద బెజవాడ వెళ్లారు. అక్కడ ఓ హోటెల్ లో బస. దిగీ దిగగానే… మంచంపై, తెల్లటి దుప్పటి మీద.. నల్లటి వెంట్రుక మెరిసిపోతూ కనిపించింది. అది అమ్మాయిదే అని అర్థమైంది. వెంటనే రమణకు ఓ తుంటరి ఆలోచన వచ్చింది. పెన్నూ పేపరూ పట్టుకొని, రావి కొండలరావు పేరు మీద ఎడమచేత్తో ఓ ఉత్తరం రాశారు. అదీ ఓ అమ్మాయి రాస్తున్నట్టు. ”మీరూ నేనూ ప్రేమించుకొన్నాం కదా, ఇప్పుడు మీ రూపం నా కడుపులో పెరుగుతోంది. వెంటనే నన్ను పెళ్లి చేసుకోండి. లేదంటే ఓ టెలీగ్రాము వేయండి. వెంటనే మీ పాదాల చెంత వాలిపోతా” అంటూ ఉత్తరం రాసి, అక్కడ దొరికిన నల్ల వెంట్రుక కూడా దానికి జత చేసి, సెంటి పూసి, పోస్ట్ చేశారు.
Read Also : ఫ్లాష్ బ్యాక్: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగరెట్!
నాలుగు రోజుల తరవాత ఏమీ ఎరుగనట్టు మద్రాసు వెళ్లిపోయారు. ప్రతీరోజూ స్నేహితుడు రావి కొండలరావుని కలుస్తూనే ఉన్నారు. కానీ ఆయన నోరు మెదపడం లేదు. చివరి ఓసారి బాపు – రమణల దగ్గర భోరు మన్నారు. ”ఎవరో నా పేరు మీద దొంగ ఉత్తరం రాశారు. అది చూసి రాధ నన్ను అనుమానిస్తోంది. నేను ఏ పాపం ఎరుగను. నా గురించి మీకు తెలుసు కాబట్టి, మీరైనా రాధకు చెప్పండి” అంటూ బతిమాలాడారు. పాపం… రావి కొండల రావు అవస్థ చూసి మిత్రులిద్దరికీ జాలేసింది. కానీ బయటపడలేదు. ”ఇలాంటి విషయాల్లో రాయబారాలు, మధ్యవర్తిత్వాలు పని చేయవు. ఎలాగూ ఆమెనే పెళ్లి చేసుకొందాం అనుకొన్నావు కాబట్టి చేసేస్కో.. అప్పుడే నీపై నమ్మకం కలుగుతుంది” అంటూ సలహా ఇచ్చారు. ఇక చేసేదేం లేక, తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చేశారు. పెళ్లయ్యాక.. తీరిగ్గా బాపు, రమణలు అసలు విషయం చెప్పేశారు. ముందు ఆశ్చర్యపోయినా, ఆ తరవాత ఆనందించారు ఆ కొత్తదంపతులు. ”మీరు గానీ ఈ ఉత్తరం రాయకపోతే.. ఇంత త్వరగా పెళ్లి చేసుకొనేవాళ్లం కాదు” అంటూ నవ్వేశారు రావి కొండలరావు – రాధాకుమారి.