కోల్కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన వైద్యురాలిపై హత్యాచారం విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరులో లోపాలు వెదుక్కుని మరింతగా ఆందోళనలు చేస్తున్నారు. ఓ ఘోరం జరిగినప్పుడు ప్రభుత్వాలపైనే కోపం చూపడం సహజం. ఇప్పుడు బెంగాల్లోనూ అదే జరుగుతోంది. ఏ చర్యలు తీసుకున్నా.. అందులో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి.
వైద్యులపై ఇతర దాడులు వేరు.. కోల్ కతాలో జరిగిన ఘోరం వేరు !
వైద్యులపై దాడులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఆ దాడులకు… ఇప్పుడు బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన దాడులకు స్పష్టమైన తేడా ఉంది . బెంగాల్లో జరిగింది అత్యుంత క్రూరమైన నేరం. ఇది ఉద్దేశపూర్వకంగా ఓ క్రమినల్.. డాక్టర్ ను హత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చంపిన విధానం చూసి మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వాళ్లు ..అలాంటి క్రూరులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిని మన చట్టాలు శిక్షించడం ఎప్పుడో మానేశాయి. ఏదో ఓ కారణంతో సీరియల్ నేరాలు చేస్తున్నా వదిలేస్తారు. ఈ కారణంగా అలాంటి మృగాలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.
వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టాలు
అందుకే ప్రతీ చోటా ..ఒక్క ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రతీ చోటా మహిళలకు భద్రతాపరమైన ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉండాలి. అందులో సందేహం లేదు. ఇందులో నిర్లక్ష్యం అనేదే ఉండకూడదు. ఆస్పత్రుల్లో జరిగే దాడులు మరో రకం. తమ సొంత వ్యక్తికి సరిగ్గా వైద్యం చేయలేదని దాడులు చేసేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటివి తరచూ జరుగుతూంటాయి. ఇలాంటి వాటి నిరోధానికి కేంద్రం గతంలోనే ప్రత్యేకమైన చట్టం తెచ్చింది ఎంతో అమలవుతోందన్నది మాత్రం.. పరిశీలన చేసుకోవాల్సింది.
వైద్యులపై దైవభావం ఉంటే దాడులు ఉండవు !
వైద్యులు పునర్జన్మ ప్రసాదించేవారు. వారి పట్ల ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వారైనా సరే… దైవసమానులుగా చూసే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఆ ఘోరానికి పాల్పడిన క్రిమినల్ అనారోగ్యానికి గురైనా ట్రీట్ మెంట్ చేయాల్సింది వైద్యులే. చట్టాలు మాత్రమే కాకుండా… వైద్యులను చూసే విధానంలోనూ మార్పు తీసుకు రావడం ద్వారా వారిపై దాడులకు అరికట్టాల్సి ఉంటుంది.