కేసీఆర్కు అస్వస్థత అంటూ సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫామ్ హౌస్ కే మెడికల్ పరికరాలు పంపారని వాట్సాప్ ఫార్వార్డులు గ్రూపుల్లో ప పంచుతున్నారు. దీనికి కారణం కేసీఆర్ కొంతకాలంగా మీడియాకు కనిపించకపోవడమే. ఆయన పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని కూడా కలవడం లేదు. ఈ కారణంగా కేసీఆర్ కు అస్వస్థత అనే ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు చెందిన కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మొదట ఈ వార్తను వైరల్ చేశారు. తర్వాత సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించారు బీఆర్ఎస్ మూడు రోజుల కిందటే ఈ అంశాన్ని ఖండించింది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. అయితే కేసీఆర్ బయటకు రాకపోవడం వల్ల ప్రచారం మాత్రం పెరుగూతూ ఉంది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చాలా సార్లు బయటకు కనిపించకుండా రోజుల తరబడి ఉంటారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత … పోలింగ్ కు గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా ఆయన బయటకు రాలేదు. పార్టీ నేతల్ని కలవలేదు. అప్పుడు కూడా ఇలాగే కేసీఆర్ కు బాగోలేదని ప్రచారం చేశారు. బండి సంజయ్ లాంటి వాళ్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. కానీ తర్వాత అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇప్పుడు కూడా అలాగే తేలిపోతుందని.. ప్రచారం చేసుకున్న వాళ్ల పరువే పోతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.