బీజేపీలో విలీనం, పొత్తులపై ప్రజలకు ఏం సంబంధమని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి.. వాటితో ప్రజలకేం సంబంధమని ఆయన అంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని.. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని స్పష్టం చేశారు.
అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని రుణమాఫీసహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమైనయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారుని విమర్శించారు.
పొత్తులు లేదా విలీనం చర్చలు ఢిల్లీలో జోరుగా సాగుతున్నాయని ఓ ఫార్ములా కూడా రెడీ అయిందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఓ గవర్నర్ నేతృత్వంలో చర్చలు కూడా పూర్తయ్యాయని ప్రకటించడంతో మరింతగా ప్రచారం ఊపందుకుంది. కానీ బీఆర్ఎస్ నీడే బీజేపీ మీద పడకూడదని గట్టిగా కోరుకుంటున్న బండి సంజయ్ . ఇలాంటి వార్తలపై గట్టిగానే రియాక్టవుతున్నారు. అయితే బండి సంజయ్ మాటలకు ఢిల్లీలో విలువ లేదని ఆర్కే చెబుతున్నారు.