ఏపీలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు తోడుగా మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. అవును… కొత్తగా ఏర్పడిన కార్యవర్గం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రాజధాని అమరావతికి మరింత ఊపునిచ్చేలా మంగళగిరిలో కొత్త స్టేడియంను నిర్మించబోతున్నారు.
సంవత్సరం లోపు క్రికెట్ స్టేడియంను అధునాతన హంగులతో నిర్మించాలని, ఆంధ్రా క్రికెట్ కు పునర్వైభవాన్ని తీసుకొచ్చేలా పని చేయాలని నిర్ణయించారు. వచ్చే రెండు సంవత్సరాలలోపు ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచును కూడా నిర్వహించేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఏసీఏ కొత్త అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు.
గతంలో వైసీపీ సర్కార్ కక్షగట్టి అంతర్జాతీయ ఆటగాడు హనుమ విహారిని ఆంధ్రా క్రికెట్ నుండి పంపించే కుట్రలు చేశారు. చివరకు తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. కానీ, హనుమ విహారిని తాము ఒప్పించి ఇక్కడి నుండే ఆడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇక రిటైర్ అయిన ఆటగాళ్ల సహయం తీసుకొని… ఏపీ క్రికెట్ ను అభివృద్ది చేసే ప్రణాళికలు రూపొందిచటంతో పాటు కొత్త ఆటగాళ్ల నైపుణ్యాభివృద్దికి కూడా తోడ్పాటు అందిస్తామని, రాబోయే రోజుల్లో ఏపీ క్రికెట్ నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పనిచేస్తుందని కేశినేని చిన్ని ప్రకటించారు.