రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే ఆయన సర్వాధికారి కాదు. ఆయన పై హైకమాండ్ ఉంటుంది. ఎవరైనా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ వద్ద తమ పలకుబడి ఉపయోగించుకుని రేవంత్ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు. అలాంటి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునందుకు కంఫర్ట్ జోన్లో పాలన చేయడం లేదు. కఠినమైన దారిని ఎంచుకుని .. ప్రజలు తనకు ఇచ్చిన బాధ్యతకు న్యాయం చేసేందుకు తనదైన పద్దతిలో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అంతర్గత శత్రువులు పెరుగుతున్నా ఆయన లక్ష్య పెట్టడం లేదు. ప్రజల ఆదరణ పెరుగుతోందన్న నమ్మకంతో ఉన్నారు.
రాచపుండు లాంటి సమస్యలను పరిష్కరించేందుకు ధైర్యంగా బరిలోకి !
తెలంగాణకు ఆర్థికంగా ఆయువుపట్టు హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సమస్యలూ కూడా పెరిగిపోయాయి. స్వార్థ పూరిత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేసిన తప్పుల వల్ల హైదరాబాద్‌కు ఎక్కువ సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది. ఆ తప్పు తాను చేయకూడదని డిసైడయ్యారు. అందుకే మూసి ప్రాజెక్టు.. హైడ్రా ఆవిర్భావం. హైడ్రా ద్వారా… ఒత్తిళ్లకు తలొగ్గకుండా అతి పెద్ద సమస్యను పరిష్కరించేందుకు రెడీ అయ్యారు. పనిలో పనిగా మూసి ప్రాజెక్టును పట్టాలెక్కించి… హైదరాబాద్‌ను మరింత సుందరంగా మార్చేందుకు సిద్ధమయ్యారు.
ఫోర్త్ సిటీ పేరుతో భారీ ప్రణాళికలు
రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని శంషాబాద్ వైపు అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన ఎక్కడికి వెళ్లినా ఆ సిటీని ప్రమోట్ చేస్తున్న వైనం స్పష్టం చేస్తోంది. కానీ ఈ విషయంలో ఆయనపై ఎంతో మంది ఆరోపణలు చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడేదో ఆయనకు భూములున్నాయని లేకపోతే భూ దందా చేయడానికి ఈ ఫోర్త్ సిటీని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ నిజాయితీగా ఫోర్త్ సిటీ కల సాకారం అయితే హైదరాబాద్ బెంగళూరును దాటిపోతుందని ఆహ్వానించడానికి సిద్ధంగా లేరు.
వ్యతిరేకతమవుతున్న కాంగ్రెస్ నేతలు
రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం చేస్తున్న పనుల వల్ల సొంత పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకమవుతున్నారు. ఇది ఆయనకు ఇబ్బందికరమే. ఆయనపై హైకమాండ్‌కు ఫిర్యాదులు పెరగవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ప్రజాప్రయోజనాలకు భంగం కలిగించకూడదని.. ఇప్పటి వరకూ జరిగిన తప్పుల్ని సరి చేసి అయినా సరే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు. తెలంగాణను ప్యూచర్ స్టేట్ గా మార్చాలనుకుంటున్నారు.
రేవంత్ ఎంచుకున్నది కఠినమైన దారి. ఈ దారిలో ముందుకెళ్లేకొద్దీ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురొస్తాయి. రేవంత్ వాటిని విజయవంతంగా అధిగమించగలరని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనలో పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించగల రాజకీయ నేత కూడా ఉన్నారు.