తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య విజయాలతో ఎన్నికల్లో సత్తా చాటింది బీజేపీ. ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో సమానంగా 8 సీట్లు తెచ్చుకొని, బీజేపీ అధినాయకత్వాన్ని కూడా ఆలోచనలో పడేసింది.
గట్టిగా పనిచేస్తే తెలంగాణలో క్రియాశీలకంగా ఎదగొచ్చన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. కానీ, దాన్ని ఆచరణలో పెట్టేవారే కరువయ్యారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని ఓ వైపు ప్రచారం, కాంగ్రెస్ పై విమర్శల ఉధృతి బీఆర్ఎస్ పెంచుతున్నా…ఇంకా సీన్ లోకి బీజేపీ రాకపోవటంతో అంతా గందరగోళం నెలకొంది.
అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నా అది పార్ట్ టైం అన్నది ఆయనతో పాటు అందరికీ తెలిసిందే. కొత్త అధ్యక్ష నియామకం ఎప్పుడో ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. 8 మంది ఎమ్మెల్యేలున్నా… ప్రజల్లో, మీడియాలో ఎక్కడా కనపడరు. వారి నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. ఒక్క బండి సంజయ్, అప్పుడప్పుడు ఈటల మాత్రమే బీఆర్ఎస్ విలీనంపై కామెంట్ చేస్తున్నా అది గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలను ధీమాగా ఉంచే స్థాయిలో లేదు.
దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయం అంతా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లే సాగుతోంది. ఇక బీజేపీ సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్. కానీ అక్కడా తెలియని నిస్తేజం కనపడుతోంది. దీంతో కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు బీజేపీ పని ఇంతే… ఫుల్ టైం ప్రెసిడెంట్ రావాల్సిందేనంటూ పార్టీలోనూ వాదనలు స్టార్ట్ అయ్యాయి.