ఆరు గ్యారంటీలలో కీలకమైన మరో రెండు హామీలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దం అవుతోంది. దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలను ప్రారంభించాలని భావిస్తోంది. లబ్దిదారుల ఎంపిక, ఇందుకోసం ఎన్ని నిధులు అవసరం అవుతాయి అనే విషయంపై అధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంది. దీనిపై అధికారులతో మరోసారి రేవంత్ చర్చించి ఈ రెండు హామీలను దసరా నాటికీ అమలు చేయాలనుకుంటున్నారు.
ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఆర్థిక సాయంకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4. 50లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అయితే, ప్రజా పాలన దరఖాస్తులో భాగంగా ప్రభుత్వానికి 55లక్షల అప్లికేషన్లు రాగా, వాటి పరిశీలనకు రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయన్నారు. ఇక, సొంత జాగా లేని వాళ్లకు ఇంటి స్థలంతోపాటు 5 లక్షలు.. ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల చొప్పున సర్కార్ సాయం చేయనుంది.
ఇక, రైతు భరోసా కింద ఎకరానికి 7,500ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే, కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా కింద సాయం చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వం గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వడం తీవ్ర విమర్శల పాలయింది. దీంతో రైతులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన ఈ కేబినెట్ సబ్ కమిటీ.. సాగుభూములకు మాత్రమే రైతు భరోసా సాయం చేయాలని మెజార్టీ అభిప్రాయం వ్యక్తం కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భూస్వాములకు కాకుండా , పేద రైతులకు మేలు జరిగేలా పది ఎకరాల్లోపు ఉన్న వారికి మాత్రమే రైతుభరోసా కింద సాయం చేయాలని నిర్ణయించింది.
దీంతో ఈ రెండు పథకాల విధివిధానాలపై మరోసారి చర్చించి దసరా నాటికి వీటిని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. తద్వారా ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శలకు చెక్ పెట్టినట్లు కూడా అవుతుందనుకుంటున్నారు.