కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో రెండు మహారాష్ట్రలోనివి.. ఒకటి బెంగళూరులోనిది. థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్‌ప్రాజెక్టు, పుణె మెట్రో మెట్రో రైలు ప్రాజెక్టు, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-3 కోసం మొత్తంగా రూ.30 వేల కోట్లకు ఆమోదించారు. అందరూ హైదరాబాద్ మెట్రో రెండో దశకు అయినా నిధులు ఇస్తారేమో అనుకున్నారు. కానీ అసలు పట్టించుకోలేదు.
బెంగళూరులో ఏకంగా మూడో దశకు నిధులు కేటాయించారు. బెంగళూరులో ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతి ప్రధాన ఏరియాను కలిపేలా ఇప్పటికే మెట్రోను నిర్మిస్తున్నారు. బెంగళూరు శివారు నుంచి పాతిక కిలోమీటర్ల వరకూ ఉండే ఎయిర్ పోర్టు వరకూ మెట్రోని నిర్మిస్తున్నారు. నిధుల కొరత లేకుండా శరవేగంగా పనులు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మాత్రం… రెండో దశకు కనీసం ప్రతిపాదనలకు ఆమెదించడం లేదు.
హైదరాబాద్ మెట్రో అత్యంత బిజీగా మారిపోయింది. ఎంఎంటీఎస్‌ల కన్నా ఘోరమైన రద్దీతో ఉంటోంది. పైగా అతి పరిమితమైన ప్రాంతాల్లోనే ఉంటుంది. మియాపూర్ నుంచి ఎల్పీ నగర్ వరకూ మాత్రమే ఉంది. బహుముఖాలుగా విస్తరిస్తే తప్ప.. ట్రాఫిక్ రద్దీని తగ్గించే అవకాశం ఉండదు. ఢిల్లీ మెట్రో తరహాలో అభివృద్ధి చేస్తే… హైదరాబాద్ కూడా శరవేగంగా విస్తరిస్తుంది. రాజకీయకారణాలో మరో కారణమో కానీ… కేంద్రం వైపు నుంచి స్పందన రావడం లేదు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం … ఇప్పుడు రేవంత్ సొంతంగా మెట్రో నిర్మాణానికి శంకుస్థాపనలు చేసుకున్నారు. కానీ కేంద్రం సాయంతో నిర్మించాల్సి వచ్చినప్పుడే… ఏళ్లకు ఏళ్లు పట్టింది. ఇప్పుడు రాష్ట్ర నిధులతో ఎంత కాలం అన్నది చెప్పడం కష్టమే. రేవంత్ రెడ్డి మెట్రో విషయంలో చాలా ప్లాన్లతో ఉన్నారు. ఇప్పుడు ప్రణాళికల్లో ఉన్న రిజినల్ రింగ్ రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని అనుసంధానం ఉండేలా ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులకు చబుతున్నారు. కానీ ఆయన ప్రణాళికలకు… నిధుల లభ్యతకు సారూప్యత కనిపించడం లేదు. మెట్రో విస్తరణ పూర్తయ్యే వరకూ ఎవరూ నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి.