కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? – ఈ ప్రశ్న ‘బాహుబలి 2’ చూడాలన్న కోరికకు బలమైన బీజం వేసింది. పార్ట్ 2 కథలు సక్సెస్ అవ్వాలంటే పార్ట్ చూస్తున్నప్పుడు అలాంటి ప్రశ్న ఏదో ప్రేక్షకుడ్ని తొలుస్తూ ఉండాలి. ‘కల్కి’ విషయంలోనూ చాలా ప్రశ్నలు ప్రేక్షకుల్ని వేధిస్తున్నాయి. వీటన్నింటినీ ముందే నివృత్తి చేస్తూ – పార్ట్ 2పై ఎలాంటి అనుమానాలూ లేకుండా ప్రేక్షకుడ్ని ముందే ప్రిపేర్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలకు నాగ్ అశ్విన్ చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పుకొస్తున్నారు. పార్ట్ 2పై మరీ అంచనాలు పెంచేయకుండా, కథలో ఏం ఉండబోతోందో దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ, ప్రేక్షకుడ్ని సంసిద్ధం చేస్తున్నారు. యాస్కిన్ (కమల్ హాసన్) పాత్రని చంపడానికే కల్కి వస్తాడని, కల్కి వచ్చాక… యాస్కిన్ అంతం అయ్యాక ఈ కథ ముగుస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ.. ఇదంతా ఊహాగానమే అని నాగ్ అశ్విన్ కొట్టి పడేశారు. ఈ సినిమాలో హీరో భైరవ (ప్రభాస్) అని, యాస్కిన్ని అంతం చేసే బాధ్యత తనదే అని గుర్తు చేశారు నాగ్ అశ్విన్. క్లైమాక్స్ లో బుజ్జితో సహా.. ఆకాశంలోకి ఎగిరిపోతాడు భైరవ. ఆ తరవాత వాళ్లు ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలు. బుజ్జిని ఈసారి వైట్ హార్స్ లా చూపిస్తారని, ఎగిరే గుర్రంలా బుజ్జి దౌడు తీస్తుందని కొంతమంది ఊహ. దాన్ని కూడా పటాపంచలు చేశారు. బుజ్జి బుజ్జిలానే ఉంటుందని, కొత్త శక్తులు రావని క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి’లో విజయ్ దేవరకొండ రాసేపే కనిపించాడు. అయితే ఆ కాసేపూ.. థియేటర్‌కి కొత్త ఉత్సాహం వచ్చింది. పార్ట్ 2లో విజయ్ మరింత ఎక్కువ సేపు కనిపిస్తాడని అందరి ఆశ. కానీ అది కూడా రూమరే అని కొట్టి పారేశారు నాగ్ అశ్విన్.
‘కల్కి 2’ ఎలా తీయాలి? అందులో ఏం చూపించాలి? అనే విషయాలపై నాగ్ అశ్విన్ కి క్లారిటీ ఉంది. పెరిగిన అంచనాలు చూసి, ఆయన కథని మళ్లీ తిరగరాస్తాడేమో అన్నది అందరి డౌటు. కానీ నాగ్ అశ్విన్‌ని ఇవేం కదిలించడం లేదు. ఆయన ఇది వరకు ఏం అనుకొన్నారో, అదే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓరకంగా ఇది మంచిదే. లేని పోని అంచనాల్ని మీద వేసుకొని, కథని పాడు చేయడం సరి కాదు. అందుకే అభిమానుల్ని కూడా ఎక్కువ ఊహించేసుకోకుండా వాళ్లనీ భూమ్మీదే ఉంచుతున్నాడు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ క్లారిటీ మెచ్చుకోవాల్సిందే.