ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంది టాలీవుడ్. నిప్పు లేకుండా కూడా పొగ పుట్టుకొచ్చేస్తుంది. ఇద్దరి మధ్య ఏదైనా గ్యాప్ కనిపిస్తే చాలు. రకరకాల వార్తలు పుట్టుకొచ్చేస్తాయ్. అల్లు అర్జున్, బన్నీ వాస్ ల విషయంలో ఇదే జరిగింది.
బన్నీకీ బన్నీ వాస్కీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గీతా ఆర్ట్స్ లో బన్నీ వాస్ మూలస్థంభం. గీతా ఆర్ట్స్ 2 లో వస్తున్న సినిమాలన్నింటికీ తనే నిర్మాత. బన్నీ ఎదుగుదలలో, ఆయన ఫ్యాన్స్‌ని మొబలైజ్ చేసే విషయంలో బన్నీ వాస్ ది కీలకపాత్ర. అయితే ఈమధ్య ఇద్దరికీ గ్యాప్ వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చాయి. దానికీ కారణం ఉంది. జనసేనకు బన్నీ వాస్ సపోర్ట్ చేశారు. ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనూ పాలు పంచుకొన్నారు. అందుకే బన్నీవాస్ని అల్లు అర్జున్ కాస్త దూరం పెట్టారని చెప్పుకొన్నారు. తమపై ఇలాంటి రూమర్లు రావడం బాధగా ఉందని బన్నీ వాస్ కూడా ఓ వేదికపై తన ఆవేదన వ్యక్తం చేశారు.
బన్నీ వాస్ రూపొందించిన ‘ఆయ్’ సినిమా ప్రమోషన్లలో బన్నీ కనిపించలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కీ రాలేదు. దాంతో గ్యాప్ నిజమేనేమో అనుకొన్నారంతా. అయితే ఇప్పుడు ‘ఆయ్’ ఈ ఇద్దరినీ కలిపింది. ‘ఆయ్’ విజయవంతమైన సందర్భంగా చిత్రబృందాన్ని బన్నీ అభినందించారు. బన్నీ వాస్ తో సహా నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంటికి పిలిచి బన్నీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. బన్నీకీ, బన్నీ వాస్ కీ మధ్య ఏం లేదని చెప్పడానికి ఈ ఫొటోలే సాక్షాలని బన్నీ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.