మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాం అంటూ ఇటు అమరావతిని చంపి, కొత్త రాజధానులపై ముందుకు వెళ్లలేక… రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిన ఘనత వైసీపీది. భారీ మెజారిటీతో గెలిపిస్తే, రాష్ట్రాన్ని అదోగతి చేసి, చివరకు అందలం ఎక్కించిన ప్రజలే పాతాళానికి తొక్కేలా వారికి వారే చేసుకున్నారు.
సరే… ఓడిపోయారు. వైసీపీ తనను తాను మార్చుకుంటుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ టూ బెంగుళూరు ప్యాలెస్ వయా గన్నవరం ఎయిర్ పోర్టు అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారని విమర్శించిన ఆయనే ఇప్పుడు బెంగళూరుకు మకాం మార్చారు.
వైసీపీని దెబ్బకొట్టిన అంశాల్లో ఒకటి రాజధాని. మూడు రాజధానులను జనం తిరస్కరించారు అని చెప్పేందుకు ఉత్తరాంధ్రలోనూ వైసీపీ ఘోర ఓటమే నిదర్శనం. కూటమి పార్టీలు ముక్త కంఠంతో అమరావతే రాజధాని అని చెప్పి, ప్రజల్లోకి పోయి… గెలిచి వచ్చారు. దీంతో మూడు రాజధానులపై వైసీపీ వెనక్కి తగ్గుతుందని అంతా భావిస్తుండగా, కొత్తగా ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ మళ్లీ పాత పాటే పాడారు.
మూడు రాజధానులే మా నినాదం… ఇప్పటికి కూడా. అందులో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. మారితే మా నాయకుడు జగన్ ప్రకటిస్తారు అంటూ బొత్స తనదైన శైలిలో జవాబిచ్చారు. ఉత్తరాంధ్ర, విశాఖ సమానంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నామని కామెంట్ చేశారు.