ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన కేంద్ర మంత్రులతో అధికార విషయాలతో పాటు రాజకీయాలపై ఎన్డీఏ కీలక నేతలతోనూ చర్చించనున్నారు. నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరే వరకూ విషయం బయటకు తెలియదు. దీంతో వైసీపీలో కొత్త టెన్షన్ ప్రారంభమయింది. ఏపీలో గత ప్రభుత్వ అవినీతిపై వరుసగా విచారణకు ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలకమైన కేసుల్లో అంటే మద్యం, ఇసుక వంటి స్కాముల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కూడా రంగంలోకి దించాలనుకుంటున్నారు. అందుకే వైసీపీకి కొత్త గుబులు ప్రారంభమయింది.
ఇటీవలి కాలంలో వైసీపీ చంద్రబాబు కన్నా నారా లోకేష్ వ్యవహారాలపైనే ఎక్కువగా టెన్షన్ పడుతోంది. గుంభనంగా పనులు పూర్తి చేసుకుని వస్తున్నారని ఏం చేస్తున్నారో మూడో కంటికి తెలియడం లేదని వారు ఆందోళనలో ఉన్నారు. ఇటీవల లోకేష్ వ్యక్తిగత పర్యటనకు జర్మనీకి వెళ్లి వచ్చిన విషయం.. రెండు వారాల తర్వాతే తెలుసుకున్నారు. జర్మనీలో ఏదో చేసి ఉంటారని.. జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన వారం రోజుల్లోనే లోకేష్ వెళ్లడం వారికి మరింత టెన్షన్ కలిగించేలా కనిపిస్తోంది.
నారా లోకేష్ .. పరిపాలనతో పాటు రాజకీయం చేస్తున్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టకూడదన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే ఆవేశపడి .. వాళ్లపై వేధింపులకు పాల్పడుతున్నారన్న భావన రాకుండా ఉండేలా చూసుకుని.. అన్ని సాక్ష్యాలతో చర్యలు తీసుకుంటున్నారు. ముందు ముందు నారా లోకేష్ రాజకీయం వైసీపీకి మరింతగా దడ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.