ప్రభుత్వ ఉద్యోగి .. ప్రభుత్వ ఉద్యోగిలానే ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుడిలాగా మారిపోతే అప్పటికి బాగానే ఉంటుంది కానీ దానికి ప్రతిఫలం మాత్రం భవిష్యత్ లో భయంకరంగా ఉంటుంది. దానికి సాక్ష్యం సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి. ఆయన ఇప్పుడు తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు.
2014-19 సమయంలో వెంకట్రామిరెడ్డి రహస్య పత్రాలను వైసీపీకి అందచేసి సస్పెన్షన్ కు గురయ్యారు. తర్వాత ఎలాగోలా మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఈ అనుభవం నుంచి ఆయన పాఠాలు నేర్చుకోలేదు. వైసీపీ గెలుపు కోసం పని చేసి అధికారంలోకి వచ్చాక… వైసీపీ నేత మాదిరిగా రుబాబు చేయడం ప్రారంభించారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా పదవి కూడా దక్కించుకున్నారు. కానీ ఆయన ఊడిగం ఊహించనంత స్థాయికి వెళ్లింది. చివరికి ఎన్నికల సమయమంలో ప్రచారం కూడాచేయడంతో ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.
ఇప్పుడు ఆయనపై అభియోగాలను కూడా ఖరారు చేశారు. ఆయనకు వివరణ ఇచ్చుకోవడానికి పదిహేను రోజుల సమయం ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమో… హోదాను భారీగా తగ్గించి అటెండర్ లెవల్ కు తీసుకెళ్లడమో చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన చేసిన తప్పులన్నీ లెక్కిస్తే ఉద్యోగంలో ఉండటానికి అర్హుడు కాదని అంటున్నారు. ఆయన వైసీపీలో చేరిపోవడం ఉత్తమమని ఇప్పటికే ఉద్యోగులు కూడా సెటైర్లు వేస్తున్నారు.