హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పడు అత్యంత శివారు ప్రాంతం అనుకున్న BHEL ఇప్పుడు సిటీలోకి వచ్చేసింది. ఆ చుట్టుపక్క ఉన్న గ్రామాలన్నీ హైదరాబాద్లో కలసిపోయాయి. చందానగర్, అమీన్ పూర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడో పతాక స్థాయికి చేరింది. అయితే బడా నిర్మాణ సంస్థలు ఇటు వైపు పెట్టిన దృష్టి తక్కువే. చిన్న చిన్న మేస్త్రీలు పెద్ద పెద్ద కాలనీలను నిర్మించేశారు. ఇప్పుడీ ప్రాంత విలువను పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి.
అమీన్ పూర్ తో పాటు పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ లోపల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టేందుకు బడా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. హైరైజ్ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. పటాన్ చెరు వద్ద ఔటర్ ను ఆనుకుని ఓ బడా నిర్మాణ సంస్థ నలభై అంతస్తుల నిర్మాణాల టవర్లను వేగంగా పూర్తి చేస్తోంది. అమీన్ పూర్ … కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్ వైపు విల్లా ప్రాజెక్టుల్ని పెద్ద కంపెనీలు చేపట్టాయి. అరబిందో రియాలిటీ కూడా ఈ వైపు పెద్ద వెంచర్లను ఏర్పాటు చేస్తోంది.
పదేళ్ల కిందట అమీన్ పూర్ వైపు చూసేవారు తక్కువ. కానీ ఇప్పుడు తెలంగాణలోనే అత్యంత ఆదాయం ఉన్న మున్సిపాలిటీగా అమీన్ పూర్ మారిపోయింది. పూర్తి స్థాయి నగరంగా మారిపోయింది. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా ఇళ్లు లభించడంతో ఎక్కువ మంది నివాస కేంద్రంగా మారింది. డిమాండ్ పెరగడంతో ఆటోమేటిక్ గా ధరలూ పెరిగాయి. ఐటీకారిడార్ కు దగ్గరగా ఉండటం.. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉండటంతో ఐటీ ఉద్యోగులు అమీన్ పూర్ వైపు ఎక్కువగా చూస్తున్నారు.
హైరైజ్ అపార్టుమెంట్లు ఇప్పుడు పలు చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. కోకాపేట.. తెల్లాపూర్లతో పోలిస్తే తక్కువకే ఇక్కడ ఇళ్లు వస్తూండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.