విజయవాడ అంటే జంక్షన్. దేశంలో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి. సౌకర్యాల్లో అయినా… విస్తరణలో అయినా …. అభివృద్ధిలో అయినా పెద్దగా ఎదుగుదల కనిపించడం లేదు. ఇంకా ద్వితీయ శ్రేణి నగరంగానే ఉండిపోతోంది. దీనికి కారణం సమీకృత అభివృద్ధి చెపట్టేలా స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడమే. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ ను గ్రేటర్ కార్పొరేషన్ మార్చి.. మెట్రో స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటే తప్ప విజయవాడకు ఆ లుక్ రాదన్న వాదన వినిపిస్తోంది.
విజయవాడను గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ గా మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. గొల్లపూడి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, నున్న, రామవరప్పాడు, గన్నవరం, కానూరు, పోరంకి, యనమలకుదురు, పెనుమలూరు అన్నీ విజయవాడలో కలిసిపోయాయి. కానీ ఇప్పటికీ పంచాయతీలుగానో.. మున్సిపాలిటీలుగానో ఉన్నాయి కానీ బెజవాడ కార్పొరేషన్ కిందకు రాలేదు. మొత్తంగా 50కిపైగా గ్రామాలు విజయవాడలో కలిసిపోయాయి. కానీ సౌకర్యాలు మాత్రం.. అథమ స్థాయిలో ఉంటున్నాయి. దీనికి కారణం కార్పొరేషన్ లో కలపకపోవడమే.
విజయవాడ నగరం వేగంగా విస్తరిస్తోంది. కానీ విజయవాడ కార్పొరేషన్ పరిధి ఆటోనగర్ బస్టాండ్ వరకే ఉంది. నిజానికి గన్నవరం నుంచి విజయవాడ ప్రారంభమవుతుంది. కానీ సాంకేతికకంగా మాత్రం గన్నవరం పంచాయతీ వేరే. గొల్లపూడి కూడా అంతే. వీటన్నింటిని కలిపేసి ఓ మెట్రో సిటీ తరహా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే తప్ప.. ప్రయోజనం ఉండదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తేనే… విజయవాడకు క్లాస్ లుక్ వస్తుందని.. మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని అనుకుంటున్నారు.
విజయవాడను గ్రేటర్ గా చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు సంకోచిస్తున్నాయో మరి !