అందరూ అభిమానించే నటుడు చిరంజీవి. అయితే చిరు అభిమానించే నటులు కూడా వున్నారు. శోభన్ బాబు అంటే చిరుకి చాలా ఇష్టం. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం వుండేది. శోభన్ బాబు నటుడిగా ముఫ్ఫై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో చిరంజీవి, ఆయన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ లోని విశేషాలివి.
చిరంజీవి: గర్వం మనిషికి ఎందుకొస్తుంది?
శోభన్ బాబు: పడిపోవడానికి
చిరంజీవి: బాహ్య శత్రువులను జయించేదెలా?
శోభన్ బాబు: అసూయ-ద్వేషం, పగ-ప్రతీకారం లాంటి అంతశ్శత్రువులను ముందు జయిస్తే బాహ్య శత్రువులను కూడా జయించడం సాధ్యమవుతుంది. అసలు అప్పుడు శత్రువులనే వారే ఉండరు గనుక.
చిరంజీవి: మీరెంతవరకు జయించారు?
శోభన్ బాబు: కొంతవరకు.
చిరంజీవి: కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు?
శోభన్ బాబు : ఎవరినో ఒకర్ని ఎన్నుకుని ఒక నిమిషం గొంతు చించుకుంటాను.
చిరంజీవి: తర్వాత?
శోభన్ బాబు: అంతా మౌనమే….అయినా ఆర్నెల్లకోసారి వస్తుంది. ఆరు నిమిషాలలో పోతుంది.
చిరంజీవి: నవ్వు – ఏడుపులపై మీ నిర్వచనం?
శోభన్ బాబు: నవ్వితే అందరూ నవ్వుతారు. ఏడిస్తే మనం ఒక్కళ్ళమే ఏడుస్తాం.
చిరంజీవి: మీ సినీ జీవితానుభవంతో ‘సినిమా రంగం’ పట్ల మీ అభిప్రాయం?
శోభన్ బాబు: రంగవల్లిలా కన్పించే రంగురంగుల మాయాబజారు.
చిరంజీవి: మీరు పరిశ్రమలో ఉంటూ మీడియాకు, సినిమా మనుషులకూ దూరదూరంగా ఉండటానికి కారణం ?
శోభన్ బాబు : ఇక్కడి పొగడ్తలుగానీ, తెగడ్తలు గానీ, స్నేహాలు గానీ, శత్రువులు గానీ ఏవీ సత్యం కావు. సత్యం కానిదేదీ నిత్యం కాదు. నిత్యం కానిదాని కోసం అనునిత్యం ఎందుకీ ఉబలాటాలని – అంటీ అంటకుండా ఉండీ ఉండకుండా ఉంటున్నాను.
చిరంజీవి: నేటి యువ హీరోలలో మీకు కన్పిస్తున్న లోపాలేమిటి?
శోభన్ బాబు: ఎవరి శక్తికి తగినట్లు వారు ప్రయత్నిస్తున్నారు. నాకేం లోపాలు కనిపించడం లేదు.
చిరంజీవి: ఎప్పుడైనా నమ్మకద్రోహాన్ని అనుభవించారా?
శోభన్ బాబు :నమ్మడం మన తప్పైనప్పుడు ద్రోహం చేయడం వాళ్ళ ధర్మం కాదా!
చిరంజీవి: ఎలా ఎదుర్కొన్నారు?
శోభన్ బాబు: విత్ సైలెన్స్
చిరంజీవి: ‘జీవితం-ధనం’ పరస్పర సంబంధాన్ని గురించి చెబుతారా?
శోభన్ బాబు: ధనం జీవితానికి కావలసిన ఇంధనం!
చిరంజీవి: కులమతాల మీద మీ అనుభవం?
శోభన్ బాబు: ప్రపంచంలో రెండే రెండు కులాలు, మతాలు -డబ్బున్నది, రెండు డబ్బులేనిది.
చిరంజీవి: ఇన్-కమ్-టాక్స్ మీద మీ అభిప్రాయం?
శోభన్ బాబు: లేనప్పుడు పైసా ఇవ్వరు. ఉన్నప్పుడు పైసా విదల్చరు.
చిరంజీవి: సినీ తార గొప్పవాడంటారా, రాజకీయ నాయకుడు గొప్పవాడంటారా?
శోభన్ బాబు: ‘సైంటిస్టు’ గొప్పవాడంటాను. మీరు చెప్పిన ఇద్దరూ లేకపోయినా అభివృద్ధి ఆగిపోదు. కాని ‘సైంటిస్టు’ లేకపోతే ఎక్కడి గొం అక్కడే! మీరు HONDA బదులు బోండా, నేను BENZ బదులు గంజితో సరిపెట్టుకోవాల్సి వచ్చేది (నవ్వుతూ)… ఇలా సాగిపోయింది ఆ ఇంటర్వ్యూ ప్రవాహం.
‘చట్టానికి కళ్లులేవు’ శతదినోత్సవం హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగినప్పుడు శోభన్ బాబు ముఖ్య అతిథి. ఆ సభలో ‘తొలి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్. మా తరంలో నేను – కృష్ణ. మా తర్వాత తరం అంతా చిరంజీవిదే’ అన్నారు శోభన్ బాబు. ఆయన మాట నిజమైంది. నాలుగు దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా వెలుగుతున్న మెగాస్టార్..ఇప్పుడు విశ్వంభరతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు.