సీఎం రేవంత్ రెడ్డిపై ఒంటికాలు మీద లేచి విమర్శలు గుప్పించిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇక కయ్యానికి ముగింపు పలికినట్లే కనిపిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మోత్కుపల్లి. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం విశేషం.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాదిగలకు కాంగ్రెస్ ఒక్కసీటు కేటాయించకపోవడంపై రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ తీరుతో మాదిగలు కాంగ్రెస్ కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ దీక్ష కూడా చేపట్టారు. కాంగ్రెస్ సీట్లు అమ్ముకుని మాదిగలను అవమానపరిచిందని ఆరోపణలు గుప్పించారు.
Also Read : జన్వాడ ఫామ్ హౌజ్ ఎవరిదీ?
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సీఎంపై మోత్కుపల్లి విమర్శలు చేయడం చర్చనీయాంశం అయింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం డిమాండ్ చేశారు. ఇక రేవంత్ తో కయ్యానికి కాలు దువ్విన మోత్కుపల్లికి పార్టీలో ప్రాధాన్యత దక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు.
రేవంత్ పై మోత్కుపల్లి చేసిన విమర్శల దృష్ట్యా భవిష్యత్ లో రేవంత్ – మోత్కుపల్లిని ఒకే ఫ్రేమ్ లో చూడటం కుదరని పని అని కాంగ్రెస్ నేతలూ ఫిక్స్ అయ్యారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ మందకృష్ణతో కలిసి మోత్కుపల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆశ్చర్యపరిచారు. ఇందుకే అంటారేమో.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని.