అచ్యుతాపురం పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. గురువారం విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబు..నేరుగా మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతోన్న బాధితులను పరామర్శించారు. ఎంత ఖర్చు అయినా మెరుగైన వైద్యం అందిస్తాం.. అధైర్యపడకండి అంటూ బాధితులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.
బాధితులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి బయట చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనలో 17 మంది మరణించారు.. 36మంది గాయపడ్డారు. అందులో 10మంది తీవ్రంగా, 26మంది స్వల్పంగా గాయపడ్డారు. వారికి ఎంత ఖర్చు అయినా వైద్య సేవలు అందిస్తామన్నారు.
మృతుల కుటుంబాలకు రూ. కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తామని చంద్రబాబు అన్నారు. ఇలాంటి ఘటనలలో ఇదే చివరిది కావాలన్న చంద్రబాబు.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతామన్నారు.