ఆలస్యంగా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకొచ్చారు కేటీఆర్. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపేందుకు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్క మంచి నాయకుడు లేడా? ఎక్కడి నుంచో అభిషేక్ మను సింఘ్వీని తీసుకొచ్చారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదని ఆవేశంగా ప్రశ్నించారు.
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఏఐసీసీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. జాతీయ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అభిషేక్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందనేది కాంగ్రెస్ వాదన. అయినా, ఆయన నామినేషన్ దాఖలు చేసి మూడు రోజులు అయ్యాక కేటీఆర్ స్పందిస్తూ.. సింఘ్వి కన్నా మంచి నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ లో లేడా అంటూ కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
Also Read : త్వరలో కేసీఆర్ రైతు యాత్ర!
సోమవారం రోజున అభిషేక్ సింఘ్వి నామినేషన్ దాఖలు చేస్తే.. అదే రోజున కేటీఆర్ ఎందుకు స్పందించలేదు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతోంది. అయితే,లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత తరఫున వాదిస్తోన్న లాయర్లలో అభిషేక్ మను సింఘ్వీ కూడా ఒకరు. ఈ కారణంగానే ఆయన నామినేషన్ దాఖలు చేసిన రోజున ఈ అంశంపై మాట్లాడితే చిక్కులు ఎదురు అవుతాయనే అంచనాతోనే కేటీఆర్ మౌనం వహించారని, ఇప్పుడు రాజకీయం చేసేందుకు ఆలస్యంగా తెలంగాణ వాదాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.