హైదరాబాద్. కోటిన్నర మంది ప్రజల్ని కడుపులో పెట్టుకుని పోషిస్తున్న నగరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న నగరం. ఈ నగరం ఎంత బాగుంటే మన రాష్ట్రం .. పొరుగు రాష్ట్రాలు.. తెలుగు ప్రజలు అందరూ బాగుంటారు. ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్ర అక్కర్లేదు. భవిష్యత్ మాత్రమే కావాలి. అందమైన హైదరాబాద్.. ఆరోగ్యకరమైన హైదరాబాద్.. ప్రశాంతమైన హైదరాబాద్ కోరుకుంటారు. వర్షం వస్తే మనిగిపోనిది.. విపత్తులొస్తే కడుపులో దాచుకునేది తమ నగరం అని గట్టిగా చెప్పుకోవాలనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తూ హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. స్వార్థ పరుల చేతిలో చిక్కి హైదరాబాద్ విలవిల్లాడుతోంది. ఓ వైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయి.. అదే సమయంలో చేసిన తప్పులూ వెంటాడుతున్నాయి. ఐదేళ్లు.. పదేళ్లుగా చేసిన తప్పులు కాదు.. మూడు, నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్‌ను వెంటాడుతున్నారు. ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ బాధ్యత తీసుకుున్నారు. ఆయనకు తెలుసు… ఈ ఆ పని అంత సులువైనది.. తేలికైనది కాదని.. ముళ్ల బాటేనని క్లారిటీ ఉంది. అయినా సరే సురక్షిత హైదరాబాద్ కోసం ఆయన మహా యజ్ఞమే ప్రారంభించారు. ఇప్పుడు చూపిస్తున్న పట్టుదలే యజ్ఞం పూర్తయ్యేదాకా కొనసాగించాలి, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా భరించాలి. అప్పుడే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
అభాగ్య నగరాన్ని మళ్లీ భాగ్యనగరంగా మార్చే ప్రయత్నం
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే కీలకమైన నగరంగా రూపుదిద్దాలని రేవంత్ పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నారు. లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి మూసీని సుందరీకరించడానికి ప్రణాళికలు వేశారు. హైదరాబాద్‌లో ప్రతి మూలకు మెట్రో వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతకు ముంచి ఫోర్త్ సిటీని కూడా సిద్ధం చేస్తున్నారు. అత్యంత ప్రణళికా బద్ధంగా ఎవరూ ఊహించని విధంగా.. సైబరాబాద్ ను మించిన సిటీగా దాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయడానికి కారణం.. పరిపాలనలో.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పమే. అయితే ఇవననీ అభివృద్ధి పనులు. ఎవరు అధికారంలో వారు అవన్నీ తామే చేశామని చెప్పుకుంటారు. ఇవాళ రేవంత్ అంతా చేసినా పదేళ్ల తర్వాత ఆయన అధికారం కోల్పోతే తర్వాత వచ్చే పార్టీ అంతా తామే చేశామని చెప్పుకుంటుంది. కావాలంటే పేర్లు కూడా మార్చేసుకుంటారు. కానీ ప్రజల్లో పడే ముద్ర కీలకం. అలాంటి ముద్ర పడాలంటే… ముందు రేవంత్ రెడ్డి తాను చేపట్టిన హైదరాబాద్ తప్పుల్ని కరెక్ట్ చేసే పనిని చిత్తశుద్ధితో కొనసాగించారు. హైడ్రా పేరుతో తానే చైర్మన్ గా చేసిన వ్యవస్థకు రంగనాథ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్‌ను నియమించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు కాలేదు కానీ.. హైడ్రా పవర్ ఏంటో రంగనాథ్ చూపించారు. చెరువు శిఖం భూముల్ని కబ్జా చేసిన వారందరికీ దడ పుట్టించారు.
ఆరంభశూరత్వం కాదని ప్రజలకు నమ్మకం
చెరువుల్ని కబ్జా చేయడం అనే రోగం.. హైదరాబాద్‌లో రియల్ భూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఊపందుకుంది. హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరవాత రంగనాథ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు 44 ఏళ్ల కిందట చెరువు పరిస్థితిపై నివేదిక అడిగారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 44 ఏండ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయి. ఇందులో అనేక చెరువులు 60 శాతం, 80 శాతం, కొన్ని చోట్ల వందకు వంద శాతం కబ్జాలకు గురయ్యాయి. ఈ చెరువుల్లో మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని హైడ్రా నిర్ణయించింది. రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకుని కన్ స్ట్రక్షన్స్ అనుమతులు నిరాకరించడం.. పనులు ఆపేయడం చేశారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పిస్తారు. రంగనాథ్ లక్ష్యాల ప్రకారం చూస్తే… ఎంతో ఉన్నతంగా ఉంది. అందుకే ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. ఇటీవలి కాలంలో ఓ ప్రభుత్వం చేస్తున్న కరెక్షన్ కు ప్రజలు ఇంత పూర్తి స్థాయిలో మద్దతు పలకడం ఇదే మొదటి సారి. రాజకీయ పార్టీలు.. రాజకీయ నేతలు ప్రతి అడుగుకూ అడ్డం పడతారు.. అది బహిరంగ రహస్యం. ఇప్పటికే పార్టీ ఫిరాయించి వచ్చిన దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపును ఆయన అడ్డుకున్నారు. అయితే అధికారులు పట్టించుకోలేదు. దానం పై కేసు పెట్టారు. ఈ ఘటన తర్వతా రేవంత్ రెడ్డిపై ప్రజలకు మరితం నమ్మకం పెరిగింది.
సొంత కుటుంబం, సొంత పార్టీ ఒత్తిళ్లకూ తలొగ్గకపోతేనే ఫలితం
హైడ్రాకు పూర్తి వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. రేవంత్ ఉన్న పట్టుదల ప్రకారం.. హైడ్రాకు ఉన్న విస్తృతి ప్రకారం ప్రత్యేకంగా నిధులు కల్పించడంతో పాటు మూడు వేల మంది అధికారులు, సిబ్బందిని కేటాయించాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే దీనిపై ఆయన రంగనాథ్‌తో కలిసి కసరత్తు కూడా చేస్తున్నారు. గొప్ప సంకల్పంతో హైడ్రాను ఏర్పాటు చేసిన సిఎం రేవంత్ రెడ్డిపై, ఒత్తిళ్లకు తలొగ్గక నిష్పక్షపాతంగా, సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న కమిషనర్ రంగనాథ్‌లపై సహజంగానే కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ట్రాన్స్ ఫర్ అయిపోతారని చాలా మంది బెదిరిస్తున్నారు. అదే సమయంలో హైడ్రా సంస్థ అనతికాలంలోనే కబ్జాకోరులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఉస్మాన్ సాగర్ పరిధి బఫర్ జోన్లో ఓరో స్పోర్ట్ విలేజీలో గ్రీన్ కో సంస్థ అక్రమంగా నిర్మించిన 20 అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. గ్రీన్ కో కు ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రిగా వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా హైడ్రాకు సంపూర్ణ అధికారులతో ఎవరిపైనా ఆపేక్ష చూపించకుండా.. తన పని తాను చేసుకునే అవకాశం కల్పిస్తే… రేవంత్ రెడ్డి పరిపాలనా పరంగా అద్భుతమైన ముందడుగు వేసినట్లే అనుకోవచ్చు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి సవాల్ రాజకీయ పరమైనదే. పార్టీలు మారి వచ్చిన దానం నాగేందర్, అరికెపూడి గాంధీ లాంటి శాసన సభ్యులు హైడ్రా సంస్థ పని తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొంతమంది అధికార పార్టీ నేతలు ఏకంగా హైడ్రా సంస్థ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ సంస్థ ను రద్దు చేయమని నేరుగానే డిమాండ్ చేస్తున్నారు. అంతా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని తెలిసిన తరవాత కూడా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే… తిరుగుబాటుకు సిద్ధమన ిసంకేతాలు పంపినట్లే. చాలా మంది రాజకీయ నేతలకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి పార్టీనే. ఎందుకంటే.. వారి పని ఈ అక్రమాలను .. కబ్జాలను కాపాడుకోవడమే. అందుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుండి హైడ్రా సంస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటుంది. . పరిమితంగా అధికారాలు ఉండడంతో ప్రజా ప్రతినిదులు, కబ్జాకోరుల ఒత్తిడితో హైడ్రా సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంది. హైడ్రా సంస్థకు ప్రత్యేక చట్టం తేవడంతో పాటు ప్రత్యేక అధికారాలు కల్పించడం లేదా స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే హైడ్రా నిర్భయంగా తమ బాధ్యతలు నిర్వహించగలరు. ఇలా నిధులు, విధులు, పవర్స్ కల్పించడం రేవంత్ రెడ్డి ఎదుర్కోనున్నరెండో సవాల్.
దశాబ్దాల తప్పుల్ని ఒక్క సారే సరి చేయడం సాధ్యం కాదు కానీ !
నిజానికి దశాబ్దాల పాటు జరిగిన తప్పుల్ని ఇలా బుల్ డోజర్లతో వెళ్లి కరెక్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. 44 ఏళ్ల క్రితం చెరువుల్ని ఇప్పుడు మళ్లీ యథాతథ స్థితికి తీసుకు రావాలంటే వేళ ఇళ్లను పడగొట్టాల్సి ఉంటుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. వాటిని అమ్ముకున్న బిల్డర్లు బాగానే ఉంటారు. కొనుక్కున్న వారు మాత్రమే బాధితులు అవుతారు. అందుకే ఈ విషయంలో హైడ్రా వాస్తవిక దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. ఎప్పుడే పదిహేను.. ఇరవై ఏళ్ల కిందట కట్టుకుంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు అని కూల్చివేస్తమంటే ఎలా అని హైకోర్టుకూడా ప్రశ్నించింది. ఇన్నేళ్ల పాటు ఎవరూ పట్టించుకోకుండా.. ఇప్పుడు ఒక్క సారే వచ్చి కూల్చేస్తామంటే అది న్యాయసమ్మతం కూడా కాదు. అందుకే .. హైడ్రా.. కూల్చివేతల విషయంలో.. చెరువులని కాపాడే విషయంలో ఓ ప్రత్యేకమైన విధానాన్న అమలు చేసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరించాల్సి ఉంది. దళాబ్దాల పాటు చేసిన తప్పుల్ని ఇప్పటికిప్పుడు సరిదిద్దాలనుకోవడం కూడా అసాధారణమే. ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఈ విషయంలో గత పదేళ్ల కాలాన్ని టార్గెట్ గా పెట్టుకుని.. బఫర్ జోన్లు.. శిఖం భూముల్ని మొత్తం క్లియర్ చేస్తే చాలా వరకూ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబీకులు బాధితులు అయినా సరే… వదిలి పెట్టకుండా ముందుకు సాగితే… అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది.
ఎన్ని కష్టాలెదురైనా పని పూర్తి చేస్తే హైదరాబాద్ చరిత్రలో రేవంత్‌కు ప్రత్యేక స్థానం !
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి డ్రైవ్‌లు జరుగుతూ ఉంటాయి. మొదట్లో బుల్ డోజర్లకు చాలా పని పడుతుంది. తర్వాత అందరూ రాజీ పడిపోతారు. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ప్రజలు అలా అనుకోవడం లేదు. ఆయన హైదరాబాద్‌కు ఏదో చేయాలని తపన పడుతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన వచ్చే ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు చెరువులు.. నాలా కబ్జాల నుంచి బయటపడేలా చేసి.. వానొచ్చిన.. వరదొచ్చినా ఏమీ మునగకుండా.. వచ్చిన నీరు వచ్చినట్లుగా కాలువుల ద్వారా బయటకు వెళ్లిపోయే మార్గాన్ని సిద్ధం చేస్తే చాలు . ప్రజలు రేవంత్ రెడ్డిని నెత్త మీద పెట్టుకుంటారు. అయితే ఇది చిన్న విషయం కాదు.. ఇంకా చెప్పాలంటే అసాధారణమైన విషయం. రేవంత్ రెడ్డి మిగతా సీఎంల మాదిరిగా కాదని.. ఆసాధారణమైన పనులు చేయగల సీఎం అని.. నిరూపించుకుంటారని ఆశిద్దాం. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు.. కానీ ప్రజలు ఆయన చిత్థశుద్ధిని నమ్మినంత కాలం ఆయన వెంటే ఉంటారు. ప్రజలు అంచనా వేసిన దాంట్లో సగం చేసినా ఆయనను… హైదరాబాద్ పునర్నిర్మాణ నేతగా గుర్తుంచుకుంటారుు. అందులో సందేహమే ఉండదు.