హైడ్రా.. హైడ్రా..హైడ్రా..హైదరాబాద్ లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న భవన నిర్మాణాలను కూల్చివేస్తు దూసుకుపోతుండటంతో హైడ్రా గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన బడా బాబుల భవనాలను కూడా కూల్చివేస్తుండటంతో రేవంత్ సర్కార్ నూతనంగా తీసుకొచ్చిన ఈ హైడ్రా పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇదే సమయంలో హైడ్రా తరహాలో వాడ్రా తీసుకురావాలనే డిమాండ్ లూ వస్తున్నాయి. వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (వాడ్రా) కావాలని డిమాండ్ లు తెరమీదకు వస్తున్నాయి. జిల్లాలో కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులను కబ్జా చేసి భవనాలను నిర్మించారు.
కాజీపేట బంధం చెరువు , వరంగల్ భద్రకాళి, ములుగు రోడ్ కోట చెరువుల ఎఫ్ టీ ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఇందులో భాగంగా 300మందికి అధికారులు నోటీసులు ఇవ్వగా…120 భవనాలను మాత్రమే కూల్చివేశారు. నేతల ఒత్తిళ్లతోనే మిగతా వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా భారీ వర్షాల సమయంలో వరంగల్ సైతం ముంపుకు గురి అవుతోంది.
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు తీసుకొచ్చిన హైడ్రా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఫ్రీగా పని చేస్తుండటంతో…హైడ్రా తరహాలో వరంగల్ కు వాడ్రా కావాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.మరి రేవంత్ వరంగల్ వాసుల ఆకాంక్ష మేరకు వాడ్రా ఏర్పాటు చేస్తారా? అనేది చూడాలి.