Maruthi nagar Subramanyam movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
సహాయ పాత్రల్లోనూ హీరోయిజం ఉంటుంది. కొన్ని సినిమాల్ని వాళ్లే గట్టెక్కిస్తారు. అలాంటి బాధ్యత చాలాసార్లు భుజాన వేసుకొన్న నటుడు రావు రమేష్. తన డైలాగ్ డెలివరీ, మేనరిజం ఇవన్నీ పాత్రనీ, సన్నివేశాన్ని మరింత రక్తికట్టిస్తాయి. చిన్న డైలాగే.. రావు రమేష్ నోట్లో చిరుత పులి అయిపోతుంది. ఆ స్టామినా ఉన్న నటుడు. ఇప్పుడు తొలిసారి పూర్తి స్థాయి పాత్రని పోషించే అవకాశం దక్కింది. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’తో. సుకుమార్ సతీమణి తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం, అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి గెస్ట్‌గా రావడంతో ఈ ‘మారుతి నగర్’కు మరింత ప్రచారం లభించింది. మరి మారుతి నగర్ ఎలా ఉంది? సుబ్రహ్మణ్యం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడా, లేదా?
మారుతినగర్లో ఉండే సుబ్రహ్మణ్యం (రావు రమేష్)కి గవర్నమెంట్ జాబ్ అంటే పిచ్చి. చిన్నప్పుడు సోది చెప్పే బామ్మ ‘నీ జాతకంలో గవర్నమెంటు జాబు రాసుంది’ అని చెప్పేసరికి దాన్నే ఫిక్సయిపోతాడు. బాగా చదివి, అన్ని ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడతాడు. టీచర్ ఉద్యోగం వచ్చినట్టే వస్తుంది. ఆ కేసు కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోతుంది. మరో ఉద్యోగ ప్రయత్నమేదీ చేయకుండా కళావతి (ఇంద్రజ)ని పెళ్లి చేసుకొని సెటిలైపోతాడు. కళావతి ఓ ఆఫీసులో క్లర్క్. ఇంటి బాధ్యత అంతా తనదే. కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) కూడా ఖాళీగా ఉంటూ, తను ఓ గొప్పింటి బిడ్డనని, ఎప్పటికైనా తన తల్లిదండ్రులు వచ్చి తనని తీసికెళ్లిపోతారంటూ కలలు కంటుంటాడు. సుబ్రహ్మణ్యంకు అప్పులవాళ్ల బెడద ఎక్కువ. చాటుమాటుగా వడ్డీలు కట్టుకొంటూ నెట్టుకొస్తుంటాడు. ఓసారి తన ఎకౌంట్ లో పది లక్షలు వచ్చిపడిపోతాయి. అవి ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. చూసీ చూసీ ఆ డబ్బులు ఖర్చు చేయడం మొదలెడతాడు. తన బాకీలన్నీ తీర్చేసుకొంటాడు. ఇంట్లో ఖరీదైన వస్తువులు కొనేస్తాడు. చివరికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న షాకింగ్ విషయం సుబ్రహ్మణ్యంకు తెలుస్తుంది. ఇంతకీ ఆ పది లక్షల కథేంటి? ఆ పదిలక్షల వల్ల సుబ్రహ్మణ్యం ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనేది మిగిలిన కథ.
మధ్యతరగతి కుటుంబాల్లో తొంగి చూస్తే ఎన్నో కథలు కనిపిస్తాయి. ఆ కష్టాల్లోనే బాధలుంటాయి. ఎమోషన్ ఉంటుంది. నవ్వులూ అక్కడే దొరుకుతాయి. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అలాంటి కథే. ఓ మధ్యతరగతి జీవికి అనుకోకుండా పది లక్షలు వచ్చిపడిపోతే ఏం జరుగుతుంది? అనే విషయాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. సుకుమార్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో కథ మొదలవుతుంది. సుకుమార్ గొంతులోనే పాత్రల పరిచయం జరిగిపోతుంది. ఆ వాయిస్ ఓవర్‌కు ఎవరు స్క్రిప్టు రాశారో కానీ, ఈ సినిమాపై ఓ మంచి ఇంప్రెషన్ ముందే పడిపోతుంది. అంత చక్కగా కుదిరింది. మారుతి నగర్‌పై ఓ పాజిటీవ్ లుక్‌తో ఓపిగ్గా, కుదురుగా సీట్లలో కూర్చోవడానికి ఆ వాయిస్ ఓవర్ ఉపయోగపడింది. ఆ తరవాత మెల్లమెల్లగా సుబ్రహ్మణ్యం తెరను ఆక్రమించడం మొదలెడతాడు. తన చుట్టూనే సన్నివేశాలు ఎక్కువగా తిరిగాయి. అర్జున్ – కాంచన లవ్ స్టోరీ ఉన్నా అది కథకు బ్రేకులు వేస్తుంటుంది. ఆ ట్రాక్ యూత్ కి నచ్చుతుందిలే అని చిత్రబృందం భావించి ఉంటుంది. కానీ వర్కవుట్ కాలేదు. కొన్ని కొన్ని సన్నివేశాల్ని రావు రమేష్ లాక్కొచ్చేశాడు. ముఖ్యంగా అజయ్‌కు బాకీ చెల్లించేటప్పుడు, పెళ్లి చూపుల సీన్లోనూ రావు రమేష్ పండించే సైలెంట్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది.
సుబ్రహ్మణ్యం అనే పాత్రని బేస్ చేసుకొని సాగే కథ ఇది. ఆ పాత్ర ఆర్క్‌ని దర్శకుడు సరిగా రాసుకోలేదేమో అనే డౌటు వేస్తుంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యంది అమాయకత్వమో, అతి తెలివో అర్థం కాదు. తను బద్దకస్తుడా? భార్యా విధేయుడా? అనేది తెలీదు. ఆ పాత్రని ఎటు కావాలంటే అటు మలచుకొంటూ వెళ్లడం ప్రధానమైన లోపం. సినిమాలో ఏ ఎమోషన్ ఒకే ఫ్లోలో వెళ్లదు. మధ్యమధ్యలో బ్రేకులు వస్తుంటాయి. ఉదాహరణకు జాడీలో డబ్బులు తీసుకొన్నందుకు ఇంద్రజ భర్తపై విరుచుకుపడుతుంది. అక్కడ ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతుంది. అక్కడ్నుంచి సుబ్రహ్మణ్యం మారతాడేమో అనిపిస్తుంది. కానీ వెంటనే మళ్లీ కామెడీలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఒక ఎమోషన్ని సస్టేన్ చేయకుండా, మరో ఎమోషన్ లోకి జంప్ అవ్వడం స్క్రీన్ ప్లే పరమైన లోపంగా కనిపిస్తుంది. ఇలాంటి జంపింగ్ లు ఈ సినిమాలో చాలాసార్లు జరిగాయి. ఓఎల్ఎక్స్ మోసాలు, డాలర్ డ్రామాలూ ఇవి వెండి తెరపై రక్తి కట్టలేదు. ప్రధాన పాత్ర వీటి వల్ల మోసపోతుందన్న విషయం ప్రేక్షకుడి ఊహకు ముందే అందేస్తుంటుంది. ‘నేను కావాలంటే నీకు మరో పది లక్షలు ఇస్తా. నీ వ్యాపారానికి పెట్టుబడి పెడతా. కానీ నీ భార్య ఉద్యోగం మానేయాలి’ అంటూ ఓ వడ్డీ వ్యాపారి కండీషన్ పెట్టడం మరీ విచిత్రంగా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అన్నీ సాగదీత సన్నివేశాల్లానే కనిపిస్తాయి. కొన్ని సీన్లు లాజిక్ కు అందవు. మరీ ఓవర్ ది బోర్డ్ గా అనిపిస్తాయి. చివర్లో ఇచ్చిన ట్విస్ట్, ముగింపు బాగానే ఉన్నా, సినిమాపై ప్రేక్షకుడు అప్పటికే ఓ అంచనాకి వచ్చేస్తాడు కాబట్టి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.
టైటిల్ కార్డులో ‘ది ఎంటర్టైనర్ రావు రమేష్’ అని కనిపిస్తుంది. నిజంగా తను ఎంటర్టైనరే. ఆ బిరుదుకు అర్హుడు కూడా. ‘మారుతి నగర్’ని చివరి వరకూ చూడగలిగామంటే దానికి కారణం రావు రమేష్. అయితే అక్కడక్కడ తాను కూడా గీత దాటి నటిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అది నటుడి తప్పు కాదు, దర్శకుడు సరిగా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చే చిక్కు. రావు రమేష్ కామెడీ కంటే ఎమోషన్ని అద్భుతంగా పండిస్తాడు. ఆ అవకాశం ఈ కథ ఇవ్వలేకపోయింది. ఇంద్రజ హుందాగా కనిపించింది. చివర్లో ఆమె వేసిన మాస్ స్టెప్పులు చూస్తే, ఇంకా తనలో ఆ పాత ఎనర్జీ అలా మిగిలిపోయిందనిపిస్తుంది. అంకిత్ బాగా చేశాడు. తను మంచి యూత్ హీరో కాగలడు. హర్షవర్థన్ ఓకే అనిపిస్తాడు. రమ్య పసుపులేటి కొన్ని చోట్ల అందంగా కనిపించింది. తను సోషల్ మీడియా స్టార్ కాబట్టి, ఆమెని ప్రేక్షకులు ఆ కోణంలోనే చూసే అవకాశం ఉంది.
దర్శకుడు స్క్రిప్టు విషయంలో కొన్ని చోట్ల మెప్పిస్తే చాలా చోట్ల దొరికిపోతాడు. ఇంకా పకడ్బందీగా రాసుకోవాల్సిన కథ ఇది. ఒకే పాయింట్ తో రెండు గంటలు నడిపించాలనుకొన్నప్పుడు బలమైన పాత్రలు కావాలి. సంఘర్షణ ఇంకా కొత్తగా చెప్పగలగాలి. కామెడీతో కొన్నిసార్లు లాజిక్కులు మర్చిపోతారేమో. అసలు లాజిక్కే లేకపోతే కామెడీని కూడా జనం పట్టించుకోరు. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. కొన్ని చోట్ల క్వాలిటీ మిస్ అయ్యింది. పాటలకు స్కోప్ లేదు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా చేయాల్సింది. మొత్తానికి రావు రమేష్‌లో ఎంటర్టైనర్ ఈ సారికి కాస్తే బయటకు వచ్చాడు. తను పూర్తి స్థాయిలో విజృంభిస్తే బాగుండేది.
తెలుగు360 రేటింగ్: 2.25/5