‘కల్కి’లో ప్రభాస్ జోకర్లా ఉన్నాడంటూ ఈ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. చాలామంది హీరోలు ఇప్పటికే అర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. సౌత్ ఇండియన్ హీరోల ప్రాబల్యం భరించలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మండి పడ్డారు. పబ్లిసిటీ కోసం ఓ స్టార్ హీరోని విమర్శించడం భావ్యం కాదని అర్షద్ వార్సీని హెచ్చరించారు. ఇప్పుడు శర్వానంద్ కూడా ఓ ట్వీట్ తో వార్సీకి వార్నింగ్ ఇచ్చాడు. ఓ నటుడు మరో నటుడ్ని విమర్శించడం నైతికత కాదని సుతిమెత్తగా మందలించాడు. ప్రభాస్ – శర్వానంద్ మంచి స్నేహితులు. ఓ స్నేహితుడిగా, ఓ సాటి హీరోగా ప్రభాస్‌ని విమర్శించిన వాళ్లపై ఇప్పుడు శర్వా ట్విట్టర్ వార్కి దిగాడు. అయితే నేరుగా అర్షద్ వార్సీ పేరుని తను ప్రస్తావించలేదు.
‘మా’ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొంది. అర్షద్ చేసిన వ్యాఖ్యలు మరీ చీప్‌గా ఉన్నాయని, సినిమా పట్ల అభిమానం ప్రేమ ఉన్న వారి మధ్య కూడా ఇలాంటి వ్యాఖ్యలు వ్యతిరేక భావాలు కలిగించే ప్రమాదం ఉందని, సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే సరిహద్దులు చెరిగిపోతున్న ఇలాంటి సందర్భంలో అర్షద్ ఇలాంటి కామెంట్లు చేయడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని ‘మా’ అభిప్రాయ పడింది. ‘మా’లో సభ్యులపై, టాలీవుడ్ హీరోలపై ఎవరైనా నెగిటీవ్ కామెంట్లు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించింది. మొత్తానికి ప్రభాస్ పై అర్షద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు టాలీవుడ్ గట్టిగానే కౌంటర్ ఇస్తోందనే అనుకోవాలి. ఇప్పటికైనా అర్షద్ దిగివచ్చి, బహిరంగ క్షమాపణ చెబితే బెటర్. లేదంటే ఇలాంటి వార్నింగులు ఇక మీద తను చాలానే వినాల్సివస్తుంది.