‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఇన్నాళ్లు ‘గేమ్ ఛేంజర్’తో అతుక్కుపోయాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ ముగించుకొని బుచ్చిబాబు కథతో, ఆ పాత్రతో ప్రయాణం చేయడం మొదలెట్టాడు. ‘గేమ్ ఛేంజర్’ డిసెంబరులో వస్తోంది. ఇక చరణ్ ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అయితే ఇప్పుడు `గేమ్ ఛేంజర్` కోసం చరణ్ డేట్లు మళ్లీ కావల్సివచ్చాయట. కనీసం మరో నాలుగైదు రోజులైనా చరణ్ డేట్లు అవసరం అని దిల్ రాజుపై శంకర్ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.
ఇటీవల రషెష్ చూసుకొన్న శంకర్, కొన్ని సీన్లకు ప్యాచ్ వర్క్ అవసరం అని భావించినట్టు సమాచారం. అందుకే… చరణ్ డేట్లు మళ్లీ తీసుకోవాలని భావిస్తున్నాడు. అదృష్టం ఏమిటంటే.. చరణ్ ఇంకా ‘గేమ్ ఛేంజర్’ గెటప్‌లోనే ఉన్నాడు. కాబట్టి.. చరణ్ డేట్లు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. కాకపోతే శంకర్ ఇలా… సినిమా తీసుకొంటూ పోతుంటే, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. చరణ్ డేట్లు ఇస్తే సరిపోదు, కాంబినేషన్ సీన్ అయితే మిగిలినవాళ్ల డేట్లు కూడా చూసుకోవాలి. అసలే శంకర్ అంటే వందలమంది ఆర్టిస్టులు, సమూహాల మధ్య సీన్లు.. ఇవే కనిపిస్తాయి. ఇవన్నీ సెట్ అయి, ఆయా సీన్లు పూర్తి చేయడం తలకు మించిన భారం. బడ్జెట్ పరంగానూ ఇబ్బందే. చరణ్ డేట్లు పట్టడం ఒక ఎత్తయితే, ఈ బడ్జెట్ భారాన్ని మోయడం దిల్ రాజుకు మరో సమస్య.