కాదేది రాజకీయానికి అనర్హం అనే స్థాయిలో రాజకీయం చేస్తున్నారు జగన్ రెడ్డి. ఇటీవల వరుసగా చావు రాజకీయాలతో మొదలుపెట్టిన ఆయన ప్రతిపక్ష రాజకీయం.. ఇప్పుడు అచ్యుతాపురం ఘటనలోనూ అదే తరహ రాజకీయం చేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
అచ్యుతాపురం ఘటనలో లోతైన విచారణ చేపట్టాలని, ప్రభుత్వం పరిహారం అందించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడమే కాకుండా మరణించిన వారికి రూ. కోటి , తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అధికారులు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి చెక్కులను అందజేస్తారన్నారు.
కానీ, జగన్ ఇవేవీ పట్టించుకోకుండా బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తాను ధర్నా చేస్తానని ప్రకటించడం విమర్శల పాలౌతోంది. ప్రభుత్వం పరిహారం అందిస్తామని చెప్పినా.. జగన్ ధర్నా చేస్తానని ప్రకటించారంటే ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం బాధితులకు రేపోమాపో పరిహారం అందించినా , తన ధర్నాకు తలొగ్గే బాధితులకు పరిహారం అందించారని , ఈ ఆర్థిక సాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వినిపోస్తోంది.
జగన్ కు ఇలాంటి అతి తెలివి తేటలు అధికంగా ఉంటాయని, ఇవే వైసీపీ కొంపముంచినా ఆయన తీరు మారలేదని … ఇప్పుడూ అదే పంథాను కొనసాగిస్తున్నారని అంటున్నారు.