జగన్ రెడ్డి చేసిందంతా చేసి ఇప్పుడు చిలుకపలుకులు పలికే ప్రయత్నం చేస్తున్నారు కానీ..అవి కాకి అరుపుల్లా మారుతున్నాయి. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఇంటికే పోనివ్వడం లేదని.. ఇదేం శాంతిభద్రతల పరిరక్షణ అని జగన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ కామెంట్ పై రఘురామకృష్ణరాజు స్పందించారు. నాలుగేళ్లుగా నియోజకవర్గానికే కాదు.. అసలు రాష్ట్రానికే తనను రానివ్వలేదు కదా మర్చిపోయారా అని ప్రశ్నించారు. రఘురామ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
జగన్ రెడ్డి పాలనలో అరాచకం రాజ్యమేలబట్టే ఆయనను అత్యంత ఘోరంగా ప్రజలు ఓడించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువుగా చేసుకుని వెంటాడారు. చంద్రబాబు అమరావతికి వెళ్లినా..కుప్పంకు వెళ్లినా రాళ్ల దాడులు చేశారు. ఎక్కడ చూసినా అదే రగడ. తాడిపత్రిలో ఐదేళ్ల పాటు జేసీ బ్రదర్స్ ను ఎన్ని తిప్పలు పెట్టారో చెప్పాల్సిన పని లేదు. నేరుగా వారింట్లోకి వెళ్లి వారి కుర్చీలో కూర్చుని సవాల్ చేసి వెళ్లారు పెద్దారెడ్డి.
ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఆయన తాడిపత్రిలో రెచ్చగొట్టే పనులకు దిగుతున్నారు. ఆయనను ఇంటికి పోనివ్వడం లేదని జగన్ రెడ్డి బాధపడుతున్నారు. కానీ రాష్ట్రంలో అందరూ వైసీపీ నేతలు ప్రశాంతంగా ఉన్నారు. తన నియోజకవర్గం పులివెందులలో ఆయన హాయిగా పర్యటిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం చేయాలనుకుంటే జగన్ చూపించిన దారిలో వంద చేయగలదు.కానీ అలాంటివి ఇష్టం లేకనే.. ప్రజాస్వామ్యయుతంగా ఉంది. అయినా జగన్ ఏమీ తెలియనట్లుగా బాధితుడిగా అరిచేందుకు రెడీ అయిపోయారు.