వైసీపీ అధినేత జగన్ రెడ్డి తమిళనాడు రాజకీయాలను అనుసరిస్తున్నారా? ఈమేరకే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? ఈ ఎజెండాలో భాగంగానే రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసిందని అంటున్నారా? జగన్ తమిళ రాజకీయ వ్యూహం సక్సెస్ అవుతుందా?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు సారధ్యంలోని కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు అప్పుడే వ్యతిరేకత వచ్చేసిందంటూ, వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని తరుచుగా జగన్ చెప్పుకొస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు మాత్రమే అవుతోంది.. అప్పుడే వ్యతిరేకత వచ్చేసిందా..? అనే అనుమానం కలగక తప్పదు. అయితే , తమిళనాడు రాజకీయాలను పరిశీలించి జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడులో సంక్షేమ పథకాల ఆధారంగా అధికార పక్షంపై విమర్శలు చేసి ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకుంటాయి. వీటి ఆధారంగా తమిళనాడులో రాజకీయం జరుగుతుంటుంది. అందుకే ఎక్కువగా ఐదేళ్లలో అక్కడ ప్రభుత్వాలు మారడం జరుగుతుంటుంది. ఇప్పుడు జగన్ అదే ఫార్ములాను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని, ఆయనపై అప్పుడే వ్యతిరేకత వచ్చేసిందని జగన్ చెబుతున్నారు. తమిళనాడు తరహ రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారుతుందని అంచనాతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. గత ఐదేళ్లలో సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని విస్మరించిన జగన్ కు ఎన్నికల్లో ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు.
అయినా, తమిళనాడు రాజకీయం వేరు.. ఏపీ రాజకీయం వేరు.. ఆ రాష్ట్ర రాజకీయ వ్యూహాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఫలితాలు రాబట్టుకోవాలనుకోవడం అమాయకత్వమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తారో మరి..